calender_icon.png 16 April, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపవాసాలు ఉంటున్నారా?

13-04-2025 12:53:27 AM

చాలామంది పండుగలకు, మొక్కులకు ఉపవాసాలు ఉంటారు. ఇది మన సంస్కృతుల్లో భాగం కూడా. ఉపవాసాలతో ఆరోగ్యానికి మేలు జరుగుతుందని కూడా పలు అధ్యయనాల్లో తేలింది. అయితే స్త్రీ,పురుషుల్లో వ్యత్యాసాల కారణంగా మహిళలకు ఉపవాసాలు అంత మంచిది కాదని డా.స్టేసీ సిమ్స్ తాజాగా ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఉపవాసాల వల్ల మహిళల జీవక్రియలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. 

డా.స్టేసీ చెప్పిన వివరాల ప్రకారం.. స్త్రీ గ్లుకోజన్ మొదలు కొవ్వుల వరకూ అనేక రకాల పదార్థాల ద్వారా తమకు కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేసుకోగలదు. మహిళల్లో ఆక్సిడేటివ్ మజిల్ ఫైబర్స్ (కండరాలు) ఉండటమే దీనికి కారణం. ఈ కండరాలు కొవ్వులను వినియోగించి శక్తిని ఉత్పత్తి చేయగలవు. అయితే ఉపవాసాల కారణంగా ఈ ప్రక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుందని డా.స్టేసీ పేర్కొన్నారు.

ఉపవాసం కారణంగా శరీరంలో ఒత్తిడి కారక కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో ఆక్సిడేటివ్ మజిల్ ఫైబర్స్.. కొవ్వులను ఉపయోగించి శక్తిని ఉత్పత్తి చేయలేవు. దీంతో.. కొవ్వుకు బదులు గ్లుకోజన్ వంటి వనరుల వినియోగం పెరుగుతుంది. కొవ్వులు అలాగే ఉండిపోతాయి. ఇలాంటి సందర్భాల్లో కసరత్తులు చేస్తే కండరాల పెరుగుదల, కొవ్వుల వినియోగంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. జీవక్రియల సమతౌల్యం దెబ్బతింటుంది. కాబట్టి మహిళలకు ఉపవాసాలతో ప్రతికూల ఫలితాలే ఎక్కువ. 

సుదీర్ఘ కాలంపాటు ఉపవాసాలు చేస్తే కండరాలు కరిగిపోయే ప్రమాదం ఉందని కూడా ఆమె పేర్కొన్నారు. జీవక్రియలు కూడా నెమ్మదిస్తాయని తెలిపారు. కాబట్టి జిమ్‌కు వెళ్లే మహిళలు ఉపవాసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉపవాసాలతో సామర్థ్యం తగ్గి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.