calender_icon.png 26 November, 2024 | 7:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలకూ ఫామ్‌హౌస్ సంస్కృతి!

30-10-2024 01:09:52 AM

  1. ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణాలు 
  2. అర్ధరాత్రి వరకూ విందులు, చిందులు
  3. కరీంనగర్ సుడా పరిధిలో 20 ఫామ్‌హౌస్‌లు
  4. ఒకే ఒక్క దానికి అన్ని అనుమతులు

కరీంనగర్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): ఇటీవల హైదరా బాద్ శివారులో ఓ ఫామ్‌హౌస్‌లో రేవ్‌పార్టీ రాష్ట్రంలో కలకలం రేపింది. రణగొణ ధ్వనులు, విదేశీ మద్యం, మత్తు పదార్థాల వినియోగంతో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే, రాజధానే కాదు.. జిల్లాలకు ఫామ్‌హౌస్ సంస్కృతి పాకింది.

జిల్లాకేంద్రాలకు చుట్టుపక్కల విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లు వెలుస్తున్నాయి. ఆ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో అటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది. కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుం డా పలువురు ఫామ్‌హౌస్‌లు, రిసార్టులు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

వాటిని వాణిజ్యపరంగా ఉపయోగిస్తూ సొమ్ము చేసుకుం టున్నారు. వీకెండ్స్‌లో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న ‘అతిథులు’ విందు, చిందులతో సమీప ప్రాంతాల ప్రజలకు నరకం చూపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అటువైపు దృష్టి సారించకపోవడం గమనార్హం. 

పదెకరాల్లో ఫామ్‌హౌస్‌లు

వ్యవసాయ భూమిని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ (నాలా)గా మార్పిడి చేయకుండానే ఫామ్‌హౌస్ నిర్మిస్తున్న పలువురు.. రైతుబంధు పొందుతూనే వ్యాపారం కొనసాగి స్తున్నారు. కొన్ని ఫామ్‌హౌస్‌లలో శుభకార్యాలు కూడా కొనసాగుతున్నాయి. ఏసీ సూట్ రూ.5 వేల చొప్పున మొత్తం కాటేజీ రోజుకు రూ.25 వేల చొప్పున వసూలు చేస్తున్నారు.

హైదరాబాద్, వరంగల్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వీకెండ్ పార్టీలు నిర్వహించుకుంటున్న సందర్భాలున్నాయి. కిట్టీ పార్టీల నిర్వాహకులు కూడా ఫామ్‌హౌస్‌లను అడ్డాగా చేసుకుంటున్నారు. ఈ ఫామ్‌హౌస్‌లపై దృష్టిసారిస్తే కొన్ని చోట్ల కొనసాగుతున్న అసాంఘిక కార్యక్రమాలకు బ్రేక్ పడుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. 

జనరేటర్లతో కొందరు.. దొడ్డిదారిన కొందరు 

ఫామ్‌హౌస్‌లు, రిసార్టులు నిర్వహించాలంటే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ అవసరం ఉంటుంది. అయితే, వ్యవసాయ భూమిలో ఫామ్‌హౌస్‌లు నడుపుతున్నవారు జనరేటర్లను ఏర్పాటు చేసుకున్నారు. కొందరు దొడ్డి దారిన ఇతర ఇంటి నంబర్లు, ఇతర ప్రాంతాలను చూపిస్తూ ట్రాన్స్‌ఫార్మర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు.

వ్యవసాయానికి అందించే ఉచిత విద్యుత్‌ను వాడడం కష్టత రం గనుక జనరేటర్లను ఏర్పాటు చేసి ఇక్కడ జరిగే కార్యక్రమాలకు విద్యుత్ అందిస్తున్నా రు. శబ్ధం లేని జనరేటర్లను ఏర్పాటు చేసి ఈ ఫామ్‌హౌస్‌లను నిర్వహిస్తున్నారు. 

సకల సౌకర్యాలతో.. 

కొందరు విద్యాసంస్థలు నడుపుతున్న వారితోపాటు రాజకీయ ప్రముఖులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు ఈ ఫామ్‌హౌస్‌లను నిర్మించారు. వీటిలో స్విమ్మింగ్ పూల్‌తోపాటు ఏసీ సూట్లు, బాంకెట్ హాళ్ల నూ పోలిన గదులను ఏర్పాటు చేస్తున్నా రు. గ్రామ పంచాయతీ నుంచి ఒక ఇంటి నంబర్‌తో ఒకే గది నిర్మిస్తున్నట్టు చూపించి వ్యవసాయ భూముల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించారు.

కరీంనగర్ శాతవాహన అర్బ న్ డెవలప్‌మెంట్ (సుడా) పరిధిలో 20 ఫామ్‌హౌస్‌లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటిలో రేణికుంట టోల్‌గేట్ పరిధి లోని ఓ ఫామ్‌హౌస్‌కు తప్ప దేనికి అనుమ తి లేదు. ఎక్కడైనా మద్యాన్ని వినియోగించాలనుకుంటే ఎక్సైజ్ శాఖ నుంచి అను మతి తప్పనిసరి.

అయితే, ఇవేవీ పాటించకుండా విందులు కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాల యం సమీపంలో బినామీ పేరుతో ఒక అధికారి ఫామ్‌హౌస్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా వీకెండ్ పార్టీలు కొనసాగుతున్నాయి. 

అనుమతులు తీసుకోకుంటే చర్యలు తప్పవు 

వ్యవసాయ భూములను నాలాగా మార్చకుండా, అనుమ తులు లేకుండా ఫామ్‌హౌస్‌లు, రిసార్టులు నిర్మించినట్టు మా దృష్టికి వచ్చింది. వీటిని గుర్తించేందుకు ఇద్దరు అధికారులను ప్రత్యేకంగా నియమించాం. అనుమతులు లేని వాటి కి, నాలాగా మార్చని వాటికి తొలుత నోటీసులు జారీ చేస్తాం.

నోటీసులకు స్పందించకుంటే చర్యలు తప్పవు. సుడా అనుమతులు లేకుండా నిర్మిస్తే వాటిని తొలగించేందుకు కూడా వెనుకాడేది లేదు. ప్రభుత్వం అక్రమ నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంది. కొత్తగా నిర్మాణాలు చేసేవారు ఇండ్ల నిర్మాణానికిగాని, ఫంక్షన్ హాళ్లకుగాని సుడా అనుమతులు తప్పనిసరి.

     కే.నరేందర్ రెడ్డి, సుడా చైర్మన్