calender_icon.png 1 March, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు..

01-03-2025 08:51:26 PM

రైతు దీక్షలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్...

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): అధికారులు,రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్(MP Etela Rajender) అన్నారు. 50 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ అనుభవిస్తున్న భూములను ముందస్తు నోటీస్ లు ఇవ్వకుండా రైతుల భూములను లాక్కునే అధికారం ఎవరిచ్చారని రైతుల జోలికొస్తే ఖబడ్దార్ జాగ్రత్త అని మాల్కాజిగి ఎంపీ ఈటెల రాజేందర్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం(Quthbullapur Constituency) దుండిగల్ సర్వే నంబర్ 453, 454 లోని 40 ఎకరాల అసైన్డ్ భూమిని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆర్టీఓ కార్యాలయానికి కేటాయించడంతో నిరసనగా దుండిగల్ వార్డు కార్యాలయం ఎదుట రైతులు శనివారం దీక్ష చేపట్టారు.

దీక్షకు మద్దతుగా ఈటెల రాజేందర్ పాల్గొని రైతులకు సాంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అసైన్డ్ భూములు రైతులకు కేటాయించేందుకు కోనేరు రంగారావు కమిటీని వేశారని రైతులకు పూర్తి హక్కు కల్పించాలని అప్పట్లో ప్రతిపాదించినట్లు గుర్తుచేశారు. 50 సంవత్సరాలుగా కష్టపడి కాపాడుకున్న భూమిని లాక్కుంటామంటే ఊరుకోమని భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) తరుపున న్యాయపోరాటం చేస్తామన్నారు. 20 సంవత్సరాలు దాటితే రైతులకు పూర్తి హక్కు కల్పించాలని రెవెన్యూ చట్టాలు చెబుతున్నా అనాలోచిత నిర్ణయాలతో రైతులకు అన్యాయం చేయవద్దని హితవు పలికారు.

మహారాష్ట్రలో 18 సంవత్సరాలకే రైతులకు హక్కు కల్పించారని, కర్ణాటకలో 22 సంవత్సరాలకే రైతులకు అసైన్డ్ భూమిపై హక్కు కల్పిస్తే తెలంగాణలో 50 సంవత్సరాలు దాటినా హక్కు కల్పించకపోవడం దారుణమన్నారు. భూముల ధరలు పెరగడంతో ప్రభుత్వానికి అసైన్డ్ భూములపై కన్నుపడిందని, సర్వే నంబర్ 453, 454 లోని 430 ఎకరాలు రైతులకు కేటాయించిన భూమిని ఇప్పటిలే 55 ఎకరాలు డబుల్ బెడ్ రూమ్స్ కు, 40 ఎకరాలు ఆర్టీఓ కార్యాలయానికి, 5 ఎకరాలు గ్రేవీయార్డుకు కేటాయించిన ప్రభుత్వం మిగతా భూమిని లాక్కొని వ్యాపార సంస్థలకు కేటాయించాలని చూస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్.మాల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విగ్నేశ్వర్, దుండిగల్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్లు అమరం గోపాల్ రెడ్డి, రాజి రెడ్డి, మాజీ కార్పొరేటర్లు విజయలక్ష్మి, మహేందర్, మాజీ సర్పంచ్ కావలి గణేశ్, ఆకుల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.