calender_icon.png 23 April, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన ఆర్‌ఓఆర్ చట్టంతో రైతులకు మేలు

22-04-2025 11:30:13 PM

కలెక్టర్ వెంకటేష్ దోత్రే...

కుమ్రం భీం ఆసిఫాబాద్/సిర్పూర్ యు (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్ మండలాల్లో  రైతులకు భూభారతి నూతన ఆర్ ఓ ఆర్ చట్టంలో పొందుపరిచిన అంశాలు, హక్కులపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావు, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాధ్ లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం ఈ నెల 14వ తేదీ అంబేద్కర్ 134వ జయంతి రోజున ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని ప్రారంభించిందని, ఈ చట్టంలో పొందుపరిచిన అంశాలు, హక్కుల ద్వారా రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. రికార్డులలో ఏమైనా చిన్న తప్పులు ఉన్న సవరించేందుకు అవకాశం కల్పించడం జరిగిందని, ముఖ్యంగా అప్పీలు వ్యవస్థ తీసుకురావడంతో రైతులకు మంచి జరుగుతుందని అన్నారు. తహసిల్దార్ జారీ చేసిన ఆర్డర్ పై రాజస్వ మండల అధికారికి, ఆర్ డి ఓ జారీ చేసిన ఉత్తర్వులపై జిల్లా కలెక్టర్ కు అప్పీలు చేసుకోవడం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు.

వారసత్వ భూముల పట్టా మార్పిడి విషయంలో వారసులందరికీ నోటీసులు జారీ చేసి వారి వాంగ్మూలం ద్వారా నిర్ణీత గడువులోగా పట్టాలు పొందే అవకాశం ఉందని, ప్రతి రైతు భూభారతిలో పొందుపరిచిన అంశాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ భూభారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టంలో సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి అవకాశం ఉందని, పార్ట్ బి లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించే అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. గతంలో వి.ఆర్.ఓ./ వి ఆర్ ఏ వ్యవస్థ గ్రామాలలో ఉండేదని, గత ప్రభుత్వం ఆ వ్యవస్థలను రద్దు చేయడం ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి లేకుండా పోయేసరికి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రజలకు వారధిగా ఉండి సేవలు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ లు, ఎంపీడీవోలు,రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.