calender_icon.png 25 November, 2024 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ హయాంలోనే రైతులకు సంకెళ్లు

24-11-2024 09:54:38 PM

లాఠీల గాయాలు..

కేసీఆర్ ను మించిన నియంత ఉన్నడా?

నిర్వాసితులను ఉరికించి.. తలలు పగులగొట్టింది మరిచిపోలే..

రైతుల నుంచే కమిషన్ తీసుకున్నోడు రైతు పక్షపాతా?

నేరెళ్ల దళితులను హింసించిన నీవా మాట్లాడేది?

కేటిఆర్ పై రాచాల యుగంధర్ గౌడ్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నియంత అంటూ విమర్శిస్తున్న కేటీఆర్ కు ... గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన నిర్బంధం గుర్తుకు లేదా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మించిన నియంత ఉన్నాడా అని బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రైతుల కోసం పోరాటాలు చేస్తున్నాడని కేటీఆర్ మాట్లాడుతున్నారని, రైతుల నుంచే కమిషన్ తీసుకున్నోడు రైతు పక్షపాతి ఎలా అవుతాడని ప్రశ్నించారు. షాబాద్ ఏరియాలో భూముల రిజిస్ట్రేషన్లు కావాలంటే పట్నం పన్ను కట్టాల్సిందేనని, టాటా కంపెనీ కూడా పట్నం పన్ను కట్టలేకే కలకత్తాకు వెళ్లిన మాట వాస్తవం కాదా అని సూటిగా ప్రశ్నించారు.


సీతారామపురం హయతాబాద్ అసైన్డ్ భూముల విషయంలో ఎన్నో అవకతవకలు జరిగాయని, ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రభుత్వం ఎకరానికి 21లక్షలు భూపరిహారం  ఇస్తే అందులో సగం రూపాయలు పట్నం పన్ను కింద దండుకున్న నీచమైన చరిత్ర నరేందర్ రెడ్డిదని, షాబాద్ ఫాంహౌస్ లో అధికారులను బెదిరించి భూములను రిజిస్ట్రేషన్ చేయించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా వెనకబడిన కొడంగల్ లో పరిశ్రమలు వస్తే ఓర్చుకోవట్లేదని, సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల అభివృద్ధి చేసుకున్నప్పుడు మా నాయకుడు ఏమనలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేస్తుంటే ఎందుకింత కడుపుమంట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పేరుతో  దోపిడీ చేసి అధికారులను బలి చేసింది మీరు కాదా? మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ నిర్వాసితులను పరిగెత్తించి కొట్టించింది మర్చిపోయారా కేటిఆర్ అని సూటిగా ప్రశ్నించారు.


నేరెళ్ళల్లో మీ అక్రమ ఇసుక దందాను అడ్డుకున్న దళితులను పనికిరాకుండా కొట్టించింది తెలంగాణ సమాజం ఇంకా మర్చిపోలేదన్నారు. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం తీసుకువస్తే, దాన్ని తుంగలో తొక్కి జివో 123 తీసుకువచ్చి, దాన్ని అడ్డం పెట్టుకొని  గద్దల్లా పీక్కుతిన్న మీరు రైతుల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రైతులను, వ్యాపారులను, పారిశ్రామికవేత్తలను బెదిరించిన నీచమైన చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని, ప్రజాపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలను మానుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని రాచాల హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.