ములుగు (జయశంకర్ భూపాలపల్లి), జూన్ 28 (విజయక్రాంతి): రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం ములుగు జిల్లాలో కలెక్టర్ దివాకరతో కలిసి పర్యటించారు. మంగపేటలో రూ.1.29 కోట్ల నాబార్డు నిధులతో చేపట్టిన రైతు సేవా సహకార సంఘం కాంప్లెక్స్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే ఏటూరునాగారం మండలం రామన్నగూడెంలోని గోదావరి నది కరకట్ట, మండల కేంద్రంలోని పల్లె దవాఖానను పరిశీలించారు. ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నదని స్పష్టంచేశారు. ప్రజలకు, రైతులకు అన్ని విధాలుగా వసతులు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. ఆమె వెంట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చిత్రా మిశ్రాతో పాటు ఆయా శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.