calender_icon.png 18 March, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

18-03-2025 12:21:41 AM

చెరుకు శ్రీనివాస్ రెడ్డి హామీతో ఆందోళన విరమణ

చేగుంట, మార్చి 17: తలాపున గోదావరి నీళ్లు వస్తున్నప్పటికీ తమ పంటలకు సాగు నీరు రాకపోవడంతో చేతికి వచ్చిన పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆగ్రహించిన రైతులు గజ్వేల్- చేగుంట రహదారిపై ఇందుప్రియాల్ చౌరస్తా లోని రామాయంపేట కెనాల్ వద్ద  ధర్నా నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల పొడవున వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

దౌల్తాబాద్ మండలం మాచినపల్లి, మెదక్ జిల్లా చేగుంట మండలం కసాన్ పల్లి, పోతాన్ పల్లి, చందాయిపేట, గోసన్ పల్లి, చిన్న శివనూర్, పెద్ద శివనూర్ తదితర గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు మధ్యాహ్నం వరకు రోడ్డుపై బైఠాయించి పంట పొలాలకు నీరందించాలని డిమాండ్ చేశారు.

ఈ విషయం తెలుసుకున్న తోగుట సిఐ లతీఫ్, దౌల్తాబాద్ ఎస్త్స్ర శ్రీరామ్ ప్రేమ్ దీప్ లు ధర్నా వద్దకు చేరుకొని రైతులను సముదాయించారు. తమ గ్రామాలకు కాలువ ద్వారా నీరు అందించే వరకు ఆందోళన విరమించమని తెలుపగా మీ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని రైతులకు సీఐ హామీ ఇచ్చారు.

రైతుల సమస్యలను పరిష్కరిస్తా..

రామాయంపేట కెనాల్ ద్వారా నీరు అందించి రైతుల సమస్యను పరిష్కరిస్తానని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్చార్జ్ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకువెళ్లి వచ్చే సంవత్సరం జనవరి కల్లా గ్రామాలకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

శ్రీనివాస్ రెడ్డి హామీ ఇవ్వగా రైతులు ధర్నాను విరమించారు. అనంతరం రైతులతో కలిసి రామాయంపేట కెనాల్ కాలువను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.