calender_icon.png 8 January, 2025 | 12:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంజాబ్‌లో రైతుల బంద్

31-12-2024 02:43:38 AM

* పలు చోట్ల ఉద్రిక్తత

* రహదారులను దిగ్బంధించి ధర్నా

* రాష్ట్ర వ్యాప్తంగా163 రైళ్లు రద్దు 

* 35వ రోజుకు చేరిన దలేవాల్ దీక్ష

చండీగఢ్/ అమృత్‌సర్, డిసెంబర్ 30: తమ డిమాండ్లను పరిష్కరించాలని సోమవారం పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ను రైతులు నిర్వహించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీతో పాటు తదితర న్యాయమైన డిమాండ్లపై కేంద్రం స్పందించడం లేదంటూ సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా బంద్‌కు పిలుపునిచ్చాయి.

సోమవారం ఉదయం7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ కొనసాగినట్లు రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు. బంద్ సందర్భంగా రైతులు, రైతు సంఘాల నేతలు చాలాచోట్ల రోడ్లను మూసివేసి ధర్నా చేశారు. దీంతో వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.

పలుచోట్ల బంద్ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమృత్‌సర్‌లోని గోల్డెన్ గేట్ ఎంట్రీ పాయింట్ వద్దకు రైతులు భారీగా చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. పాటియాలా జాతీయ రహదారిపై టోల్‌ప్లాజాల వద్ద రైతులు ధర్నాకు దిగారు. దీంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

భటిండాలోని రాంపూర్ ఎంట్రీ పాయింట్ వద్ద రైతులు ఆందోళన చేయడంతో పట్టణంలోకి రాకపోకలపై తీవ ప్రభావం పడింది. మొహాలీలోని ఐఐఎస్‌ఈఆర్ చౌక్ వద్ద ఎయిర్‌పోర్ట్ రోడ్ కురాలి రోడ్ టోల్‌ప్లాజా, లాల్రూ సమీపంలోని అంబాలా హైవే టోల్ ప్లాజా, ఖరార్ మొరిండా హైవే సహా కీలక మార్గాలను రైతులు దిగ్బంధించారు.

బంద్ సందర్భంగా రాష్ట్రమంతటా షాపులను మూసివేశారు. బస్సులు రోడ్డెక్కలేదు. బంద్‌కు వ్యాపారులు, ఉద్యోగ సంఘాలు, కార్మికులు, మాజీ సైనికులు, సర్పంచ్‌లతో పాటు వివిధ వర్గాల వారు మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు భారీగా పోలీసులను మోహరించారు. మొహాలి జిల్లాలో దాదాపు 600 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. 

163 రైళ్లు రద్దు..  

బంద్ ప్రభావం రైలు సర్వీసులపైనా పడింది. రైతులు రైల్‌రోకో చేయడంతో పంజాబ్ మధ్య 163 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీటిలో వందేభారత్ రైళ్లు కూడా ఉన్నాయి. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. అయితే రైళ్ల రద్దుపై సరైన సమాచారం లేకపోవడంతో రైల్వే స్టేషనల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కాగా బంద్ నేపథ్యంలో అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కల్గించలేదని రైతు సంఘాల నేత సర్వాన్ సింగ్ తెలిపారు. ఎయిర్‌పోర్టులకు వెళ్లేవారిని, ఉద్యోగ కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారిని, ఆస్పత్రులకు వెళ్లేవారిని తాము అడ్డుకోలేదని చెప్పారు. 

35వ రోజుకు దీక్ష..

రైతుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రైతు నాయకుడు జగదీత్ దలేవాల్ చేపట్టిన దీక్ష సోమవారానికి 35వ రోజుకు చేరింది. వైద్య పరీక్షలు చేసుకోవడానికి ఆయన తిరస్కరిస్తున్నారు. పంజాబ్, హర్యానా సరిహద్దులో దలేవాల్ దీక్ష చేస్తున్నారు.

రైతుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించేవరకు నిరాహార దీక్షను కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. కాగా జనవరి 4న పంజాబ్‌లోని ఖనౌరీ  పట్టణంలో కిసాన్ మహాపంచాయత్ నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు రైతు నాయకులు ప్రకటించారు.