calender_icon.png 6 October, 2024 | 5:57 AM

త్వరలో రైతు ధర్నాలు

06-10-2024 02:30:10 AM

  1. సర్కారు వైఫల్యాలపై పోరాడుతాం 
  2. సీఎం, మంత్రిపై పరువు నష్టం దావా వేస్తా 
  3. కందుకూరు రైతు ధర్నాలో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

రంగారెడ్డి, అక్టోబర్ 5 (విజయక్రాంతి)/ మహేశ్వరం: మోస పూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజాపాలన తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు స్పష్టంచేశారు. రైతులను సంఘటితం చేసి రాష్ట్రవ్యాప్తంగా రైతు ధర్నాలు చేపట్టనున్నట్టు ప్రకటించారు.

అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్న కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒక్కటీ అమలు చేయలేదని విరుచుకు పడ్డారు. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు రోజుకో ప్రకటన చేస్తూ రైతులను గందరగోళంలోకి నెడుతున్నారని మండిపడ్డారు.

సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లి, ఆయన పోటీ చేసిన కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు రుణమాఫీ కాక రైతులు బ్యాంకుల చుట్టు తిరుగుతూ అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రైతు ధర్నాకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖలు బాధ్యతాయుతమైన పదవీలో ఉండి సమాజం సిగ్గుపడేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకమీదట హద్దు మీరు మాట్లాడితే పరువు నష్టం దావా వేసి కోర్టుకీడుస్తామని హెచ్చరించారు. 

మోదీకే భయపడలే.. 

తెలంగాణలో బీఆర్‌ఎస్ ఉనికిలేకుండా చేస్తామంటూ బీరాలు పలికిన మోదీకే తాము భయపడలేదని, అలాంటిది ఈ చిట్టినాయుడికి  తాము భయపడుతామా? అని కేటీఆర్ అన్నారు. గుంపు మేస్త్రీ అంటే కట్టేటోడని, ఇళ్లు కూలగొట్టేటోడు చిట్టీనాయుడు అని ఎద్దేవాచేశారు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు మూసీ సుందరీకరణ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని మరోసారి ఆరోపించారు.

సుందరీకరణ పేరుతో నలభైయాబై ఏళ్ల నుంచి ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ బతుకుతున్న నిరుపేదల ఇండ్ల మీద పడ్డారని మండిపడ్డారు. మా ఫౌంహౌస్‌లు, మా ఇళ్లు కూలగొడితే మీ కళ్లు చల్లబడుతాయనుకుంటే కూలగొట్టండి..

కానీ రెక్కల ముక్కలు చేసుకొని పేదలు కట్టుకొన్న గూళ్లను మాత్రం కూల్చోద్దని ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు. మూసీ బ్యూటిఫికేషన్ కాదని అది లూటిఫికేషన్ అని ఆరోపించారు. మూసీ సుందరీకరణలో వచ్చే కమీషన్ డబ్బులకు బదులు ౪ కోట్ల ప్రజలం కలిసి జోలపట్టి మీకు తోచినంత ఇస్తామని, మా జోలికి రావద్దొని కోరారు.

ఫోర్ బ్రదర్స్ సిటీ 

తమ ప్రభుత్వ హయంలో అంతర్జాతీయ స్థాయిలో ఫార్మాసిటీ పేరిట ముచ్చర్ల కేంద్రంగా 14 వేల ఎకరాలను సేకరించి ఫార్మా విలేజులు నిర్మించేందుకు యత్నిస్తే నాడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అడ్డుకొందని కేటీఆర్ గుర్తుచేశారు. రియల్ ఎస్టేట్ కోసమే ఫార్మా అంటూ నాడు బీఆర్‌ఎస్‌పై విమర్శించారన్నారు.

తాము అధికారంలోకి వస్తే ఫార్మా ను రద్దు చేస్తామని, రైతులకు భూములు ఇచ్చేస్తామని మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, రేవంత్‌రెడ్డి, భట్టి, మల్‌రెడ్డి రంగారెడ్డి హామీలు ఇచ్చారని.. ఇప్పుడు ఫార్మాను రద్దు చేశారా? అని నిలదీసారు. ఫార్మాసిటీ ని రద్దు చేస్తే భూములు వెనక్కి ఇవ్వాల్సి వస్తుందని.. పేర్లు మార్చి తాము సేకరించిన 14 వేల ఎకరాల భూములోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్‌సిటీ, నెట్ జీరోసిటీని నిర్మిస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్తున్నదని మండిపడ్డారు.

వెల్దండ, మాడ్గుల, కల్వకుర్తి, కందుకూరులో ఫోర్త్‌సిటీ పేరు చెప్తూ రియల్ వ్యాపారానికి తెరలేపారని విమర్శించారు. కందుకూరుపై మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకాభిమానం ఉందని చెప్పారు. అందుకోసమే కందుకూరు ముచ్చర్ల వరకు మెట్రో, మెడికల్ కళాశాల మంజురూ చేశారని గుర్తు చేశారు.

సీఎం కు నిజంగా ప్రేమ ఉంటే ఇక్కడికి ఒక ఇంజనీరింగ్ కళాశాల ఇవ్వాలని, ఇక్కడికి కేటాయించిన నిధులు, కళాశాలకు అడ్డుపుల్ల వేయడం ఏమిటని నిలదీశారు. దసరా పండుగ వచ్చిన ఏ ఒక్కరి ముఖంలో ఆనందం లేదన్నారు. రైతు రుణమాఫీ కాక, రైతుబంధు, రైతు భీమా ,ఫించన్లు రాక ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందకా ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారన్నారు.

అనంతరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పాలనలో రైతులకు స్వర్ణయుగం అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తమ బిడ్డలకు ఫాంహౌస్‌లు ఉన్నాయని పదేపదే ప్రకటిస్తున్నారని.. తనకు ముగ్గురు కొడుకులు, ఒక బిడ్డ ఉందని.. నలుగురికి నాలుగు ఫాంహౌస్‌లు కడతనా? అని ప్రశ్నించింది. అవి ఎక్కడ ఉన్నా కూల్చుకోవచ్చని సవాల్ విసిరారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనంద్, మహేశ్వర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, రజిని తదితరులు పాల్గొన్నారు.