హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): రైతులు పత్తిని సీసీఐ కేంద్రాల్లోనే అమ్మేలా చూడాలని, మేజర్ మార్కెట్ కమిటీలను ఆధునీకరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోళ్లపై గురువారం సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు.
పత్తి కొనుగోళ్లపై సమగ్ర వివరాలు అందించేలా ఒక వెబ్ పోర్టల్ తయారు చేశామని, దీని ద్వారా సీసీఐ ఇప్పటివరకు ఎంత పత్తిని కొనుగోలు చేసింది? ఎంత పత్తిని తిరస్కరించింది? అనే అంశాలు తెలియజేస్తాయన్నారు. మార్కెటింగ్ అధికారులు, ప్రాంతీయ అధికారులు జిన్నింగ్ మిల్లులను ఆకస్మిక తనిఖీలు చేసి, రిపోర్టును డైరెక్టర్ మార్కెటింగ్ శాఖకు అందించాలని ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు పత్తి కొనుగోలు కేంద్రాలను కూడా పర్యవేక్షించాలని పేర్కొన్నారు. మార్కెటింగ్ కేంద్రాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను ఉపయోగించుకొని దగ్గరలోని సీసీఐ సెంటర్లలోనే పత్తిని అమ్ముకోవాలని రైతులకు సూచించారు.
రైతులు పత్తిలో తేమశాతం 8 నుండి 12 మధ్యలో ఉండేలా చూసుకుంటే అధిక మద్దతు ధర పొందవచ్చని, అదే విధంగా పత్తి అమ్ముకోవడంలో ఏమైన సమస్యలు వస్తే వాట్సాప్ ద్వారా తెలియజేయాలని పేర్కొన్నారు.