calender_icon.png 17 November, 2024 | 9:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు మోసపోవద్దు

17-11-2024 06:59:19 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఐబిలో ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు దళారుల మాటలు నమ్మి, ధాన్యాన్ని అమ్మి నష్టపోవద్దని కోరారు. ప్రభుత్వం సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధర రూ. 2320 ఇస్తూ, అదనంగా 500 రూపాయలు బోనస్ అందజేస్తుందన్నారు. నాణ్యత ప్రమాణాలను పాటించి రైతులందరూ మద్దతు ధరను పొందాలని సూచించారు. ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఫిర్యాదులు ఉన్న తెలియజేయాలన్నారు.

బస్తాలలో 41 కేజీల ధాన్యానికంటే ఒక గింజ కూడా ఎక్కువ రైతులు ఇవ్వ వద్దని సూచించారు. గత ప్రభుత్వం రైతులకు ఒక బస్తా తూకంపై 10 కేజీల వరకు దోపిడీకి పాల్పడిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వేరైనా రెండు ఒకటేనని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతుంటే నిశ్శబ్దంగా ఉన్న బిజెపి, రైతులకు మేలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. జాతీయ రహదారి పేరుతో 30 మంది వ్యాపారులకు మేలు చేసి, సుమారు 400 మంది రైతుల నుండి వ్యవసాయ భూమిని తీసుకుని బీజేపీ అన్యాయం చేసిందన్నారు. రబి పంటల సాగు కోసం కడెం ప్రాజెక్టు నుండి 2 టీఎంసీల నీరు అందిస్తామని హామీ ఇచ్చారు.

దీంతో 20 వేల ఎకరాలు సాగవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తుందని తెలిపారు. విద్య, వైద్యానికి ప్రభుత్వం ప్రాముఖ్యత తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇటిక్యాల చెరువులో ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లలో నిర్మించి అక్రమ కట్టడాలను తొలగిస్తామన్నారు. నియోజక వర్గంలో అవసరమైన నాలుగు చోట్ల లిఫ్టులను ఏర్పాటు చేసి రైతుల వ్యవసాయానికి నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గడ్డం త్రిమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్, వైస్ చైర్మన్ ఎండీ ఆరీఫ్, కాంగ్రెస్  మండల అధ్యక్షుడు పింగిలి రమేష్,  కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, వెంకటేశ్వరరావు, బియ్యాల తిరుపతి, నల్లపు పోషన్న, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.