12-03-2025 01:41:24 AM
మునుగోడు, మార్చి 11 (విజయ క్రాంతి) : రైతులు యాసంగిలో ఆరుతడి పంటలను సాగు చేయాలని మునుగోడు ఏడీఏ వేణుగోపాల్ అన్నారు. మండలంలోని జక్కల వారిగూడెంలో ఎండిపోయిన వరి పొలాలను మంగళవారం ఆయన పరిశీలించారు.
చౌడు భూమిలో సాగు చేసిన వరికి జింకు లోపం వస్తుందని, పంట ఎదుగుదల తగ్గి ఎరుపురంగులోకి మారి దిగుబడి గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. నివారణకు ఎకరానికి 20 కేజీల జింకు వేసుకోవాలని లేదా పిచికారీ చేయాలని సూచించారు.
యాసంగిలో బోరుబావుల ఆధారంగా వరి సాగుచేసే రైతులు నీటి లభ్యత ఆధారంగా ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేసుకుంటే మంచిదన్నారు. ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని చెప్పారు. ప్రభుత్వం సబ్సిడీ సైతం ఇస్తుందని గుర్తు చేశారు. ఆసక్తిగల రైతులు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలి కోరారు. ఆయన వెంట ఏఓ మల్లేశ్, ఏఈఓ మౌనిక, రైతు కర్నాటి ఈశ్వరయ్య ఉన్నారు.