కలెక్టర్ వెంకటేష్ దోత్రే...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రైతులు సన్నరకం ధాన్యాన్ని జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధరతో పాటు బోనస్ పొందాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం రెబ్బెన మండలం నారాయణపూర్ గ్రామంలో గల రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, ఈ క్రమంలో సన్నరకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు.
నిబంధనల ప్రకారం తాలు, దుమ్ము లేకుండా ధాన్యాన్ని ఆరబెట్టి ప్రేమ శాతం లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతుల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించడం జరిగిందని, త్రాగునీరు, ఓ. ఆర్. ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరుగుతుందని, గన్ని సంచులు, టార్పాలిన్ కవర్లను కొరత లేకుండా సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. రైతులు దళారీలను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రామ్ మోహన్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.