calender_icon.png 12 March, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి

08-03-2025 11:24:36 PM

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి...

సూర్యాపేట (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలో పంట పొలాలకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కూమార్‌తో కలిసి నూతనకల్ మండలంలో ఎండిన పంట పొలాలను పరిశీలించారు. జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి కాళేశ్వరం జలాలను ఇవ్వడం చేతగాకపోతే మాజీ సీఎం కేసీఆర్‌కు అప్పజెప్పండని ఎద్దేవా చేశారు. ఎస్సార్‌ఎస్సీ కాలువల ద్వారా పంటలకు సాగునీరు అందించిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని పేర్కొన్నారు. రైతులకు సాగునీరు అందించకపోవడం రాజకీయ కక్ష్య సాధింపు చర్యగా అభివర్ణించారు.

సాగునీరు లేక పొలాలు ఎండిపోతుంటే అధికార పార్టీ నాయకులు ఏం పట్టనట్లే వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కాంగ్రెస్.. డబ్బులు దోచుకుని దాచుకునే పార్టీ అని విమర్శించారు. 2014కు మునుపు పరిస్థితులు మళ్లీ వచ్చాయన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి నీళ్లను తీసుకుపోతామంటుంటే మన సీఎం రేవంత్‌కు సోయే లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎస్సార్‌ఎస్‌స్సీ కాలువల ద్వారా నీళ్లను అందించి రైతులను ఆదుకోవాలన్నారు.