calender_icon.png 11 January, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు సహకార సంఘాలు అండగా ఉండాలి

02-11-2024 12:06:16 AM

  1. గత అవకతవకలపై వేగవంత విచారణ చేపట్టాలి
  2. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రాథమిక సహకార సంఘాలు రైతులకు మరింత సులభతరంగా, సమర్థవంతంగా సేవలందేలా అండగా నిలవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో కోపరేటివ్, మార్కెటింగ్ అధికారులతో సమీక్ష  నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంఘాలను ఏర్పాటు చేసి.. వాటి పరిపుష్టికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, డీసీసీబీ, డీసీఎంఎస్‌లో గతంలో జరిగిన అవకతవకలపై శాఖాపరమైన విచారణను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆధునిక అవసరాల దృష్ట్యా ప్రయోగాత్మకంగా ప్రతీ జిల్లాకు మోడల్ మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

మార్కెట్ల ఆధీనంలో ఉన్న గోదాముల నిర్వహణ, ఖాళీ స్థలాలను వాణిజ్య అవసరాలకు ఉపయోగపడేలా చేసి, ఆదాయం పెంచాలని.. ఆ నిధులను రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేలా సౌకర్యాల కల్పనకు వినియోగించాలని కోరారు. మార్కెట్లు, జిన్నింగ్ మిల్లులకు వచ్చే పత్తిని వెంటనే కొనుగోలు చేసేలా ఏర్పాట్లు  చేయాలని, జిల్లా అధికారులు, సెక్రటరీలు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు.

అకాల వర్షాలకు మార్కెటింగ్, వ్యవసాయ శాఖ అధికారుల, సీసీఐ అధికారుల అప్రమత్తంగా ఉండి, రైతు తీసుకొచ్చిన పంటలు తడవకుండా కాపాడేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి కొనుగోలు విషయంలో అవకతవలకు పాల్పడితే ఉపేక్షించేదిలేదని స్పష్టం చేశారు. సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు ఉదయ్‌కుమార్, జీ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.