17-04-2025 12:00:00 AM
అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎమ్మెల్యే మురళి నాయక్ విజ్ఞప్తి
మహబూబాబాద్, ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): సాంకేతిక కారణాలతో రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ కానీ రైతులకు సాంకేతిక సమస్యలు తొలగించి రుణమాఫీ పథకం అమలు చేయాలని, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ రైతుల వివరాలతో కూడిన నివేదికతో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావుకు విజ్ఞప్తి చేశారు.
మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో సుమారు పదివేల మంది రైతులు 2 లక్షల లోపు రుణమాఫీ కాకుండా మిగిలిపో యారని చెప్పారు. బ్యాంకుల్లో రైతుల ఖాతాలకు సంబంధించి సాంకేతిక సమస్యలు ఉన్నాయని వీటిని పరిష్కరిస్తే రైతులకు రుణమాఫీ పథకం అమలు జరుగుతుందని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ ఈనెల 21న జరగనున్న బ్యాంకర్ల సమావేశంలో మహబూబాబాద్ నియోజకవర్గ రైతుల రుణమాఫీ అంశాన్ని పరిశీలించి, అర్హులైన రైతులకు రుణమాఫీ జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే చెప్పారు.