21-04-2025 09:44:31 PM
బాసర,(విజయక్రాంతి): రైతులకు వారి భూములపై సమగ్ర హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం భూ భారతి (నూతన ఆర్ఓఆర్)-2025 చట్టాన్ని తీసుకువచ్చిందని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. సోమవారం బాసర రైతు వేదికలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధరణి ద్వారా పరిష్కారం కాని సమస్యలకు కొత్త భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసిన వ్యవసాయ భూములపై పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ప్రభుత్వం క్రమబద్ధీకరించేందుకు వీలు కల్పించిందని వివరించారు.
భూముల హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణ కోసం కొత్త చట్టం అమలులో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని, ఆ దరఖాస్తులను రెవెన్యూ డివిజన్ అధికారి, కలెక్టర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అభ్యంతరాలుంటే కలెక్టర్ వద్ద అప్పీల్, ఆపై ల్యాండ్ ట్రిబ్యూనల్ వద్ద అవకాశాలు ఉన్నాయని వివరించారు. పురాతన అప్పీల్ వ్యవస్థలతో పోలిస్తే, ఈ కొత్త రెవెన్యూ కోర్టుల ద్వారా రైతులకు వేగవంతమైన న్యాయం లభిస్తుందని చెప్పారు. చిన్న, సన్నకారు రైతులకు ఉచిత న్యాయ సహాయం అందుతుందని పేర్కొన్నారు.
ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి వార్షికంగా వాటిని ప్రజల ముందు ప్రదర్శిస్తారని, ఆధార్ తరహాలో భూమికి ప్రత్యేక భూదార్ నంబర్ కేటాయించి ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అనంతరం రైతులు అడిగిన వివిధ భూ సమస్యలకు కలెక్టర్ సమాధానం ఇచ్చారు. ఈ అవగాహన సదస్సులో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ కోమల్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి రమణ, తహసిల్దార్ పవన్ చంద్ర, ఎం పి డి ఓ అశోక్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.