calender_icon.png 17 April, 2025 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు అఫ్ టైప్ మొక్కలకు నష్ట పరిహారం ఇవ్వాలి

08-04-2025 06:18:29 PM

ఆయిల్ పామ్ బోర్డు ఏర్పాటు చేయాలి..

అశ్వారావుపేట (విజయక్రాంతి): 2016-2020 మధ్యకాలంలో వచ్చిన ఆఫ్ టైప్ మొక్కలకు ఆయిల్ ఫెడ్ అధికారులు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ ఆయిల్ పామ్ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం నారంవారిగూడెం సమీపంలో ఉన్న ఆయిల్ ఫెడ్ డివిజనల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆయిల్ పామ్ రైతు సంఘం అధ్యక్షులు కే పుల్లయ్య మాట్లాడుతూ... మొక్కలు ఎదిగి ఫల సాయం రావటానికి 7, 8 సంవత్సరాలు పడుతుందని, ఎకరంలో వేసిన 57 మొక్కల్లో 5 నుండి 6 మొక్కలు ఎదుగుదల లేకుండా గెలలు రాకుండా నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని ఆఫ్ టైప్ మొక్కలుగా గుర్తించినట్టు అధికారులు చెపుతున్నారని, ఇటువంటి మొక్కలు వేలల్లో ఉన్నాయని గెలలు రాకపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

ఎక్కువ శాతం పామ్ ఆయిల్ సాగు విస్తీర్ణం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరుగుతుందని, ఐఐఓపి ఆర్ ద్వారా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆయిల్ ఫెడ్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ కాబట్టి అందులో భాగస్వాములు అయిన రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నూనె శుద్ధి కర్మాగారాన్ని అశ్వారావుపేట, దమ్మపేట ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలని, ఎక్కడో సిద్దిపేట, జనగాంలో ఏర్పాటు చేస్తే రవాణా ఖర్చులు పెరగటమే తప్ప ఉపయోగం లేదని అన్నారు. దాదాపుగా రెండున్నర మెట్రిక్ టన్నుల గెలల నుండి  సుమారుగా 60 వేల మెట్రిక్ టన్నుల పామాయిల్ ఉత్పత్తి అవుతుందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వంశీ కృష్ణ, అన్నవరపు సత్యనారాయణలు ప్రసంగించారు. అనంతరం ఇన్ ఛార్జ్ డివిజన్ అధికారి రాధాకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతులు కారం శ్రీ రాములు, మహేశ్వర రెడ్డి, ప్రసాద్, కృష్ణారావు తదితర రైతులు పాల్గొన్నారు.