calender_icon.png 23 April, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలి

23-04-2025 03:49:55 PM

జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాస్ రావు

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): నకిలీ విత్తనాల వల్ల జిల్లాలో ఒక్క రైతు కూడా నష్టపోవద్దని జిల్లా ఎస్పీ  డివి శ్రీనివాస రావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. సంబంధిత అధికారులు అందరూ సమన్వయంగా పని చేసి రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా జరగకుండా చూడాలన్నారు. రాష్ట్రానికి, దేశానికి వ్యవసాయం ముఖ్యమైన ఆధారం అలాంటి వ్యవసాయం చేసి,  ఆరుగాలం కష్టపడే రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా విత్తన సంస్థలు, డీలర్లు, వ్యాపారులపై ఉన్నదని, విత్తన వ్యాపార డీలర్స్ బాధ్యతగా మంచి నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలన్నారు.

రైతులకు, వ్యవసాయానికి నష్టం కలిగేలా నకిలీ విత్తనాలు అమ్మితే అలాంటి వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని, పి.డి యాక్ట్ తప్పదని, షీట్స్ నమోదు చేస్తామని హెచ్చరించారు.  మహారాష్ట్రకి జిల్లా ముఖ్య సరిహద్దుగా ఉండడం వల్ల నకిలీ విత్తనాలు ఎక్కువగా సరఫరా అయ్యే అవకాశం ఉన్నది. ముందస్తు తనిఖీలు, రైతులకు అవగాహన కల్పించడం, డీలర్స్ కు అవగాహన కల్పించడం, సరిహద్దు లలో పటిష్టమైన నిఘాతో నకిలీ విత్తనాలు నివారించాలన్నారు. రైతులతో సమావేశాలు నిర్వహించి చైతన్యపరచాలి. గతంలో నకిలీ విత్తనాల కేసుల్లో సంబంధం ఉన్నవారిపై నిఘా ఉంచాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 

నాణ్యమైన కంపెనీ విత్తనాలు ఎంచుకోవాలి. లేబుళ్లు, ప్యాకింగ్ లేని విత్తనాలు కొనుగోలు చేయవద్దని కోరారు. తక్కువ ధరకు వస్తున్నాయని గ్రామాల్లోకి వచ్చే మద్యవర్తుల వద్ద విడి  విత్తనాలు కొనుగోలు చేయవద్దు. ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్స్ నుండి విత్తనాలు కొనుగోలు చేస్తే మంచిదని సూచించారు. ఇతర రాష్ట్రాల నుండి జిల్లాల లనుండి ఎక్కువ మొత్తంలో విత్తనాలు కొనుగోలు చేసే రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకోవాలని కోరారు. నకిలీ విత్తనాల గురించి, అనుమానిత బ్రోకర్లు, డీలర్ల గురించి పోలీసు వారికి ( డయల్ 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్) లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.