25-03-2025 03:48:41 PM
పెబ్బేరు: పెబ్బేరు మండల పరిధిలోని గుమ్మడం సబ్ స్టేషన్ ముందు మంగళవారం ఆగ్రహించిన రైతులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. నదీపరివాహక ప్రాంతంలో ఉన్న 33/11 కెవి సబ్ స్టేషన్ లో ఉన్న పవర్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు గురి కావడంతో మూడు రోజుల నుండి వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయడంలో అంతరాయం కలిగింది. దీంతో తమ పంటలు ఎండిపోతున్నాయని గుమ్మడం తిప్పాయపల్లి గ్రామానికి చెందిన రైతులు గుమ్మడం సబ్ స్టేషన్ దగ్గర ధర్నా నిర్వహించారు.
యుద్ధ ప్రాతిపదికన ట్రాన్స్ఫార్మర్ రిపేరు చేసి నిరంతర విద్యుత్ సరఫరా ఇవ్వాలని, ఇప్పటికే తమ పంటలు ఎండిపోయాయని, వారు నినాదాలతో ధర్నా నిర్వహించారు. విద్యుత్ సరఫరా విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్ళగా విద్యుత్ ఉన్నతాధికారులతో మాట్లాడి రెండు రోజులలో సమస్యలను పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. దీంతో రైతుల ధర్నా విరమించి వ్యవసాయానికి నిరంతర సరఫరా ఇవ్వాలని ఎండిపోయిన వరి కర్రలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొండారెడ్డి, తొండ బలరాముడు, జగదీశ్వర్ రెడ్డి, ఎల్ రవి కుమార్ రెడ్డి, నేతుల రాజు, దామోదర్ రెడ్డి, ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.