calender_icon.png 4 February, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిట్టుబాటు ధర కోసం రైతుల ధర్నా

04-02-2025 01:36:39 AM

* మిర్చి మార్కెట్‌లో నిలిచిపోయిన లావాదేవీలు 

* రైతు నాయకులతో చర్చలు 

ఖమ్మం, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులంతా సిండికేట్‌గా మారి గిట్టుబాటు ధర రాకుండా చేస్తుండటంతో రైతులు రాజకీయ పార్టీల నేతృత్వంలో ఆందోళనకు దిగారు. సీపీఐ రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ ఎదుట పార్టీ కార్యకర్తలతో కలిసి రైతులు ధర్నా నిర్వహించి, వ్యాపారులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.

దీంతో కొద్దిసేపు లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ సమితి సభ్యుడు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హేమంతరావు మాట్లాడుతూ వ్యాపారులు సిండికేట్‌గా మారి మిర్చి రైతులను దెబ్బతీస్తున్నారన్నారు. సిండికేట్‌గా మారడం వల్ల గిట్టుబాటు ధర రావడం లేదని, రైతు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

పరిస్థితిలో మార్పు రాకుంటే మిర్చి యార్డ్‌లో లావాదేవీలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. జెండాపాట ధర కూడా చెల్లించడం లేదన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ యర్లగర్ల హన్మంతరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హన్మంతరావు మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఆందోళన చేస్తున్న రైతు నాయకులతో చర్చలు జరిపారు. గిట్టుబాటు ధర ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాతామని రైతు సంఘం నేతలు పాలకవర్గానికి స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేశ్, నాయకులు మౌలానా, జితేందర్‌రెడ్డి, యర్రాబాబు, జానిమియా, రైతు సంఘం నాయకులు దొండపాటి రమేశ్, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.