17-04-2025 12:00:00 AM
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హనుమకొండ, ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): రైతులు క్షేమంగా ఉండాలని, గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ అందిస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో డిసిఓ సౌజన్యంతో సొసైటీ (పాక్స్) వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని, అనంతరం వర్ధన్నపేట టౌన్ పరిధిలోని ఫిరంగి గడ్డ నందు మల్లికార్జున గ్రామీణ సమాఖ్య సంఘం (ఐకెపి) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు రైతు భరోసా అందిస్తూ సన్న వడ్లకు మార్కెట్ ధరతో పాటు 500 రూపాయల బోనస్ అందిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, రెండు రకాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దొడ్డు రకం, సన్న రకం వడ్లను వేరు వేరుగా కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.
వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, పాక్స్ చైర్మన్ రాజేష్ ఖన్నా, హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, ఐకెపి నిర్వాహకులు జిల్లా అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.