- రూ.500 బోనస్‌తో అన్నదాతల ఆసక్తి
- మద్దతు ధర తక్కువగా ఉన్నా బోనస్‌తో లాభం
- రూ.3,100కు ప్రైవేటు వ్యాపారుల కొనుగోలు
- యాసంగిలో 60 లక్షల ఎకరాల్లో వరి సాగు
- అందులో 45 లక్షల వరకు సన్నరకాలకు అవకాశం
హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): యాసంగి సీజన్‌లో సన్నరకం వడ్ల సాగుకే రైతులు మొగ్గు చూపే అవకాశం ఉంది. వానాకాలంలో సన్నవడ్లు అమ్మిన రైతులకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇవ్వడంతో సన్నాల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది.
యాసంగిలో 60 ఎకరాలో వరిపంట సాగు అవుతుందని, అందులో 45లక్షల ఎకరాల వరకు సన్నాలు పండించే అవకాశం ఉందని భావిస్తోంది. అందుకు తగట్టుగా వరి విత్తనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. వానాకాలం సీజన్‌లో విత్తనాలకు కొరత రావడంతో ఇక నుంచి అలాంటి పరిస్థితులు రాకుండా నవంబర్ చివరి వారంలో మండల వ్యవసాయశాఖ కార్యాలయాలకు తరలించారు.
ఈసారి సన్నధాన్యం రికార్డు స్థాయిలో పండించేలా వ్యవసాయ శాఖ ప్లాన్ చేస్తుంది. బహిరంగ మార్కెట్‌లో సన్నబియ్యానికి విపరీతమైన డిమాండ్ ఉంది. మధ్యతరగతి, ఉన్నతవర్గాలు పెద్దమొత్తంలో కొనుగో లు చేస్తుండటంలో ప్రైవేటు మిల్లర్లు, ట్రేడర్లు ఈసారి సన్నవడ్ల కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకముందే కల్లాల వద్దకు వెళ్లి కొనుగోలు చేశారు.
దీంతో జనవరి నుంచి ప్రభుత్వం రేషన్ దుకాణాల సన్నబియ్యం పంపిణీ ఆలస్యమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ సన్నవడ్లకు బోనస్‌తో కలిసి రూ. 2,830 చెల్లిస్తుంది. ప్రైవేటు వ్యాపారులు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా రూ. 3,100 వరకు కొనుగోలు చేశారు. దీంతో రైతులు దొడ్డు వరి పంటను తగ్గించి సన్నవడ్లు సాగు చేసేందుకు ఏర్పాట్లులో మునిగిపోయారు.
60 లక్షల ఎకరాల్లో వరి సాగు..
ఈ యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసి 1.54 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేసింది. ఇందులో దాదాపు 45 లక్షల ఎకరాల్లో సన్నవడ్లు వేసే అవకాశం ఉంది. 95 లక్షల మెట్రిక్ ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఎరువులు, రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సిద్దమయ్యారు.
దిగుబడి తగ్గినా సన్నాలతో లాభమే..
దొడ్డు రకాలు ఎకరానికి 28 క్వింటాళ్ల దాకా దిగుబడి వస్తే సన్నవడ్లు 22 నుంచి 25 క్వింటాళ్లు వస్తాయి. వానాకాలం సీజన్‌లో గత మద్దతు ధర క్వింటాల్‌కు మద్దతు ధరను సాధారణ రకానికి రూ. 2,300, ఏ గ్రేడ్‌కు రూ. 2,320గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాపారులు సన్నవడ్లను రూ. 3,100 చెల్లించి కొనుగోలు చేశారు.
కొన్ని ప్రాంతాల్లో కోతలకు ముందే రైతులకు అడ్వాన్స్ ఇచ్చి కొన్నారు. మద్దతు ధర కంటే ఎక్కువ రేటు రావడంతో పాటు ధాన్యం ఆరబెట్డడం, తూర్పార బట్టడం, కొనుగోలు కేంద్రాలకు తీసుకరావడం వంటి శ్రమ రైతులకు తప్పింది. యాసంగి పంటలకు మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.
పెరుగుతున్న సన్నాల సాగు..
వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం 2019 రాష్ట్రంలో 91.45లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం వడ్ల దిగుబడి ఉండగా, 86.79లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం దిగుబడి వచ్చింది. 2020 ఏడాదిలో 125.51లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం, 93.01లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం, 2021 105.90 లక్షల మెట్రిక్ టన్నులు సన్నవి, 96.26లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం దిగుబడి వచ్చింది.
2023 174.18లక్షల దొడ్డు ధాన్యం, 86.26 లక్షల సన్నధాన్యం దిగుబడి చ్చింది. మార్కెట్‌లో సన్న రకాలకు డిమాండ్, వినియోగం ఎక్కువగా ఉండటంతో ధర భాగా పెరిగింది. దీంతో ప్రభుత్వం సన్నరకాల వరి సాగు పెరిగేలా రైతులను ప్రొత్సహించేందుకు బోనస్‌తో ప్రయత్నాలు వేగం చేస్తుంది.
సాగు చేసే సన్నవడ్ల రకాలు..
తెలంగాణలో ఎక్కువగా ఆర్‌ఎన్‌ఆర్, కేఎన్‌ఎం, వర్ష, కావేరి, హెచ్‌ఎంటీ, చింటూ, జైశ్రీరామ్, బీపీటీ వంటి సన్న రకాలు సాగు చేస్తున్నారు. కొన్ని జిల్లాలో సాయిరామ్, సాయిరామ్ గోల్డ్, దఫరి 1008, అక్షయ, అక్షయ గోల్డ్, సిరి, సమృద్ధి, జీకె సావిత్రి, దివ్యజ్యోతి, అంకుర్ 101, డబ్ల్యూజీఎల్ 14 రకా లు కూడా వేస్తున్నారు. సన్నవడ్లకు సుడిదోమ, అగ్గి తెగులు, కాండం తొలిచే పురుగు ఎక్కువగా సోకుతుంది. రైతులు వ్యవసాయ అధికారు లు సలహాలు, సూచనలు తీసుకుంటే తెగుళ్ల నుంచి బయటపడవచ్చు.