నిర్మల్ జిల్లా భైంసా రహదారిపై ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడుతున్న అధికారులు
నిర్మల్, నవంబర్ 14 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్, కన్కపూర్ గ్రామాలకు చెంది న రైతులు గురువారం ఆందోళనలు చేశారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకవస్తే అధికారులు పంటను కొనకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. సంచికి 42.60 కేజీలకు బదులు 44 కేజీల తూకం వేస్తున్నారని ఆరోపిస్తూ భైంసా రహదారిపై ఆర్లి ఎక్స్‌రోడ్డు వద్ద సుమారు 500 మంది రైతులు బైఠాయించారు.
దాదాపు గంటన్నర సేపు రాస్తారోకో చేయడంతో వదందలాది వాహనాలు రోడ్డు మీదే నిలిచిపోయాయి. స్థానిక ఎస్సైలు అశోక్, గణేష్, హన్మండ్లు, భాస్కరచారీ, శ్రీకాంత్ అక్కడికి చేరుకుని ధర్నా విరమించాలని కోరారు.
అయినా వినకపోవడంతో భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డికి, సీఐ నైలుకు సమాచా రం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. దీంతో అధికారులు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా అధికారి కిరణ్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడించి, సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.