25-02-2025 12:02:36 AM
అబ్దుల్లాపూర్‌మెట్, ఫిబ్రవరి 24: రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామ బాధిత రైతులు అనాజ్‌పూర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయం వరకు రైతులు పాదయాత్ర చేశారు. అనంతరం తహసీల్దార్ ఆఫీసు వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డికి మెమోరాండం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఎం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1991 సంవత్సరంలో అనాజ్‌పూర్ గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 274 ,275 ,276, 277, 278, 281 సీలింగ్ భూమిలో 125మందికి 125 ఎకరాలు పట్టా పాస్ బుక్కులు ఇచ్చారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దరిద్రమైన “ధరణి” తీసుకొచ్చి.. ఆ రైతులకు కొత్త పట్టాబుక్కులు ఇవ్వలేదు... ఆన్‌లైన్‌లో కూడా ఎక్కించలేదన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరిగి రైతులు అలసిపోయారన్నారు. ఈ గ్రామం ఫిలిం సిటీ, సంఘీ పరిశ్రమలు ఉండడం వల్ల ఎప్పటికైనా.. ప్రభుత్వం వారికి అప్పజేప్పడానికి ఎదురు చూస్తున్నట్లు అర్థమవుతుందని జోస్యం చెప్పారు. అనాజ్ పూర్ రైతులకు పట్టా పాస్ బుక్కులు ఇచ్చి.. వారికి న్యాయం చేసే వరకు ఎర్రజెండా అండగా ఉంటుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి పట్టా పాసుబుక్కులు ఇవ్వాలని డిమాండ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం అబ్దుల్లాపూర్‌మెట్ మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా, మండలం సభ్యులు ముత్యాలు శ్రీను, బాలరాజ్ గుండె శివ, ఎం. లింగస్వామి, రైతులు మహేష్, రవి, భిక్షపతి, రాములు, శ్రీనివాస్ 100 మంది రైతులు పాల్గొన్నారు.
పూర్తి స్థాయిలో రికార్డులను పరిశీలించి న్యాయం చేస్త: తహసీల్దార్
అనాజ్‌పూర్ గ్రామ రైతుల సమస్యను పూర్తి స్థాయిలో రికార్డులను పరిశీలించి.. ఆ రైతుల సమస్యలను త్వరలో పరిష్కరించి వారి తగు న్యాయం చేస్తానని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి రైతులు హామీనిచ్చారు.