10-02-2025 02:11:39 PM
రైతు జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
నల్లవల్లి జేఏసీ ఆధ్వర్యంలో పోస్టల్ కార్డు ఉద్యమం
నిరసనలో పాల్గొన్న మహిళలు, రైతులు
పటాన్ చెరు,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి ప్యారా నగర్ గ్రామాల మధ్య జీహెచ్ఎంసి ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్(Dumping Yard)కు వ్యతిరేకంగా మండల ప్రజలు చేపట్టిన నిరసనలు ఉదృతంగా మారాయి. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం సోమవారం నాటికి ఆరవ రోజుకు చేరుకుంది. ఒక వైపు నల్లవల్లి గ్రామస్తులు జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు చేపడుతుండగా... మరోవైపు గుమ్మడిదలలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మండల కేంద్రం గుమ్మడిదలలో జాతీయ రహదారిపై రైతు జేఏసీ ఆధ్వర్యంలో రైతులు మహిళలు అఖిలపక్ష నాయకులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. డంప్ యార్డ్ ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్న గ్రామాలను, ప్రజలను, అటవీలో ఉన్న వన్యప్రాణులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేసి భవిష్యత్తు తరాలను ప్రమాదంలో పడేయోద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. నల్లవల్లి జేఏసీ ఆధ్వర్యంలో పోస్టల్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. పీఎం నరేంద్ర మోడీకి వెయ్యి, సీఎం రేవంత్ రెడ్డికి వెయ్యి, గ్రీన్ ట్రిబ్యునల్ కు వెయ్యి పోస్టుకార్డుల పంపించే ఉద్యమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి డంపింగ్ యార్డ్ ను నిలిపివేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.