calender_icon.png 1 November, 2024 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రచారాస్త్రంగా రైతు సమస్యలు

28-04-2024 12:20:00 AM

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం అప్పుడే తారస్థాయికి చేరుకుంది. నామినేషన్ల ఘట్టం ముగిసీ ముగియగానే ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ప్రచారయాత్రలు మొదలు పెట్టారు. ఓవైపు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్ట్టగా, మరోవైపు పీసీసీ అధ్యక్షుడుగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ప్రతిరోజూ జిల్లాల్లో పర్యటిస్తూ, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.

కమలకాథులు కూడా ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, తదితర రాష్ట్రనేతలతోపాటుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి జాతీయ నాయకులు సైతం రాష్ట్రంలో ఇప్పటికే పర్యటించి ప్రచారంలో జోష్‌ను పెంచారు. వచ్చే వారం ప్రధాని నరేంద్ర మోడీ కూడా మూడు రోజులపాటు రాష్ట్రంలో ప్రచారం సాగించ నున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక, ఖర్గే వంటి నేతలుకూడా ప్రచారానికి రానున్నారు.   అయితే, ఈ మూడు పార్టీల ప్రచారం అంతా కూడా రైతన్నను కేంద్రంగా చేసుకుని సాగుతుండడం గమనార్హం. 

తాము అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రైతు రుణాలను మాఫీ చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రభృతులు రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయడంతో మొదలైన రచ్చ రాజీనామాల డిమాండ్ల దాకా వెళ్లింది. బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలపై ప్రభావం చూపించే ప్రమాదం ఉండడంతో వచ్చే ఆగస్టు 15 నాటికల్లా రైతు రుణాలను మాఫీ చేసి తీరుతామని, దేవుళ్ల సాక్షిగా హామీ ఇస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని హరీశ్‌రావు అంటూ గడువులోగా రుణమాఫీ హామీని నేరవేర్చకపోతే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ హామీ నెరవేరిస్తే తాను ఎమ్మె ల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటుగా రాజకీయాలనుంచే వైదొలగుతానని ఈ సందర్భంగా హరీశ్‌రావు సవాలు విసిరారు. హరీశ్‌రావు సవాలును స్వీకరిస్తున్నానని, రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండాలని రేవంత్ అనడం, గన్‌పార్కు అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఇరువురమూ ప్రమాణం చేద్దామంటూ హరీశ్ ప్రతి సవాలు చేయ డం, ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు కూడా అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయం ముగిసాక రుణమాఫీ జరిగేనా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.

రైతు సమస్యలే ప్రచారాస్త్రాలు

మరోవైపు కేసీఆర్ కూడా రైతుబంధు, దళితబంధు లాంటి పథకాలను అమలు చేసే స్థితిలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్లు కనిపించడం లేదంటూ రేవంత్ ప్రభుత్వంపై ప్రతి రోజూ దాడి చేస్తూనే ఉన్నారు. వడ్లకు రూ.500 బోనస్, ధాన్యం కొనుగోలు, కరవు పరిస్థితులు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడం ఇలా లెక్కలేనన్ని రైతు సమస్యలతో బీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ రేవంత్ సర్కార్‌ను నిలదీ సేందుకు ప్రయత్నిస్తుండడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్‌ఎస్‌సహా బీజేపీ సైతం రేవంత్ సర్కార్‌పై ఇవే విమర్శలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు భట్టి, ఉత్తమ్, తుమ్మ ల, కోమటిరెడ్డి ప్రభృతులు అటు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూనే అసెం బ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హా మీని అమలు చేసి తీరుతామని అన్నారు.

తెలంగాణ ప్రజలకు సోనియా, రాహుల్‌లు ఇచ్చిన హామీలపై వెనక్కి తగ్గేదే లేదని ప్రజలకు భరోసా ఇస్తూ వారిలో నమ్మకాన్ని కలిగిం చే ప్రయ త్నం చేస్తున్నారు. ఓవైపు బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీపైనా, మరోవైపు కేసీఆర్, బీఆర్‌ఎస్‌పైనా ఎదురు దాడి చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ ప్రచారం మొత్తం తన చుట్టూ కేంద్రీకృతం అయ్యేలా చేయగలిగారు. అలా చేయడం ద్వారా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుసరించిన వ్యూహాన్ని మరోసారి అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ ప్రయత్నంలో ఆయన విజయం సాధించి రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో పదికి పైన ఎన్ని సీట్లు సాధించినా రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ఆయన పలుకుబడి పెరుగుతుంది. అంతేకాదు, గత లోక్‌సభ ఎన్నిక ల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకున్న బీఆర్‌ఎస్ బలాన్ని ఎంతగా తగ్గిస్తే అంతగా రాష్ట్రంలో తన ప్రభుత్వం సుస్థిరం అవుతుందనేది ఆయన భావన. అందుకే, ఆ పార్టీనుంచి ఎవరు వస్తామన్నా కాదనకుండా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు, బీజేపీ కూడా దాదాపుగా అదే వ్యూహాన్ని అమలు చేస్తూ ఉంది. 

ముక్కోణ పోటీతో ఎవరికి మేలు?

ఈ రెండు పార్టీలనుంచి ఎదురవుతున్న ప్రమాదం నుంచి పార్టీని కాపాడుకోవడానికే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ, ‘పార్లమెంటులో తెలంగాణ సమ స్యలపై ప్రశ్నించే గొంతుక కావాలంటే తమ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని’ ప్రజలను కోరుతున్నారు. దీంతో మొన్నటిదాకా కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉన్న పోటీ కాస్తా ఇప్పుడు ముక్కోణంగా మారింది. మిగతా స్థానాలతోపాటు గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలోనూ గెలుపు కోసం రేవంత్ రెడ్డి పాటుపడుతున్నారు. బీఆర్‌ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకొని లోక్‌సభ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న రంజిత్‌రెడ్డి, దానం నాగేందర్, కడియం శ్రీహరి కుమార్తె కావ్యల గెలుపు బాధ్యత కూడా  రేవంత్‌రెడ్డిపై ఉండడంతో  సర్వశక్తులు ఒడ్డి ప్రచారం సాగిస్తున్నారు.  బీఆర్‌ఎస్ నేతలు ఆత్మరక్షణలో ఉండడం, ఇద్దరు ముగ్గురు తప్ప బీజేపీలో రాష్ట్రస్థాయి నేతలు లేకపోవడం కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అంశం. అయితే, మొన్నటిదాకా పదేళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీగానే కాకుం డా కేంద్రంతో కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన నేతగా కేసీఆర్‌కు ఉన్న ఇమేజి బీఆర్‌ఎస్‌కు అనుకూలించే అంశాలు. 

ఓటరు ఎవరి వైపు?

అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిం దని, ఆ వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే గ్రహించారని, అందుకే వారు తమ పార్టీనే గెలిపిస్తారని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. మరోవైపు మరోసారి ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, మోడీ చరిష్మాయే రాష్ట్రంలో తమ పార్టీకి అత్యధిక స్థానాలు తెచ్చి పెడుతుందని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అన్ని స్థానాల్లోను మూడో స్థానానికే పరిమితమ వుతుందని, తమకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసేనని అంటున్నారు. ఎన్నికల ప్రచారం ఇంకా రెండు వారాలకు పైగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వేడి రోహిణి కార్తె ఎండల్లాగా మండి పోతున్నది. ఓటరు ఈ మూడు పార్టీల ప్రచార హోరుకు ఏ విధంగా కన్విన్స్ అవుతాడు, ఎవరికి ఓటు వేసి గెలిపిస్తాడనేది వంద డాలర్ల ప్రశ్న. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటరు నాడి పట్టడం ఎవరికీ సాధ్యం కాలేదు. 

ఎన్నికల ప్రచారం ఇంకా రెండు వారాలకు పైగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వేడి రోహిణి కార్తె ఎండల్లాగా మండి పోతున్నది. ఓటరు ఈ మూడు పార్టీల ప్రచార హోరుకు ఏ విధంగా కన్విన్స్  అవుతాడు, ఎవరికి ఓటు వేసి గెలిపి స్తాడనేది వంద డాలర్ల ప్రశ్న. ఎందుకంటే గత  అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటరు నాడి పట్టడం ఎవరికీ సాధ్యం కాలేదు. 

కె. రామకృష్ణ