calender_icon.png 1 February, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీకి రైతుభరోసా సొమ్ము

01-02-2025 01:02:47 AM

  1. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  2. మా పాలనలో 6.5 లక్షల రేషన్ కార్డులిచ్చాం..
  3. లేదని కాంగ్రెస్ బుకాయించడం సిగ్గుచేటు 
  4. మున్సిపల్ చైర్‌పర్సన్లతో సమావేశం

హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): ‘రైతుభరోసా ఖాతాల్లో కాదు.. ఢిల్లీకి రైతుభరోసా సొమ్ము చేరుతున్నది’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని తెలంగాణలో శుక్రవారం బీఆర్‌ఎస్ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ 420 హమీలిచ్చి, తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కొత్తగా 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిందని, కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని బుకాయించడం సిగ్గుచేటన్నారు. ఉమ్మడి పాలనలో మున్సిపాలిటీలు మురికికూపాలుగా ఉండే వని, బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే పట్టణాలు ప్రగతి బాట పట్టాయని గుర్తుచేశారు.

కొన్ని పట్టణాలు, నగరాల్లో తిరుగులేని అభివృద్ధి సాధించి జాతీయ అవార్డులు సైతం కైవసం చేసుకున్నాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ పట్టణాలకు అధోగతి పట్టిందని అభిప్రాయపడ్డారు. రియల్ ఎస్టేట్ కుదేలైందని, హైడ్రా, మూసీ ప్రాజెక్టుల పేరుతో పేదల కట్టడాలను పడగొడతున్నారని ధ్వజమెత్తారు. 

బీఆర్‌ఎస్ పాలనలో నల్లగొండ పట్టణాన్ని సమగ్రాభివృద్ధి చేశామని, కానీ.. అదే పట్టణంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు లేవని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ మహాధర్నాలో స్వయంగా  తాను పాల్గొన్నానని, రైతు సమస్యలపై గళమెత్తానని గుర్తుచేశారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనపై లేనిపోని వ్యాఖ్యలు చేశారని, దానికి బదులు నల్లగొండ అభివృద్ధికి పాటుపడితే బాగుంటుందని హితవుపలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలు చేయడంలో విఫలమైందని,   ఆ వైఫల్యాలను ఎత్తిచూపేందుకే తమ పార్టీ గాంధీజీ వర్ధంతి రోజు ఆయన విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశామని వెల్లడించారు.

మున్సిపాలిటీల పరిధిలో పాలకవర్గాల పదవీ కాలం ముగిసినప్పటికీ, ప్రజల మధ్యనే ఉండాలని సూచించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.