- వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- చేవెళ్ల, షాబాద్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
చేవెళ్ల, జనవరి 6: జనవరి 26న రైతు భరోసా అందిస్తామని, ఎకరాకు రూ.12వేల చొప్పున నేరుగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
సోమవారం స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్, అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి పామెన భీమ్ భరత్‌తో కలిసి చేవెళ్ల, షాబాద్ మండలాల్లో పలు అభివృద్ధి పనులను తుమ్మల ప్రారంభించారు.
సర్దార్‌నగర్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు మార్కెట్‌యార్డు చైర్మన్ పీసరి సురేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ జంగయ్య, పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. త్వరలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పక్కన రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.2వేల కోట్లతో హోల్‌సెల్ మెగా మర్కెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తుమ్మల తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. చేవెళ్ల నియోజకర్గంలోని రైతులు, వ్యవసాయ మార్కెట్లకు తనవంతుగా ఎలాంటి సహకారమైనా చేస్తానని హామీ ఇచ్చారు.
మొయినాబాద్ మండలంలో మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి పామెన భీమ్ భరత్, ఎమ్మెల్యే కాలె యాదయ్య.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు.
మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, పీసీబీ మెంబర్ సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ వసంతం, రాష్ట్ర అధికార ప్రతినిధి సతీశ్, పీఏసీఎస్ చైర్మన్లు వెంకట్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, వైస్ చైర్మన్ రాములు, గుడిమల్కాపూర్ వైస్ చైర్మన్ చంద్ర శేఖర్, నాయకులు పాల్గొన్నారు.