28-08-2024 12:33:48 AM
ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
రూ.1.52 కోట్ల హషీష్ ఆయిల్ స్వాధీనం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (విజయక్రాంతి): పంటల సాగుతో డబ్బులు చాలక మాదకద్రవ్యాల అమ్మకాలు చేస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గమ్మెలి గోవిందరావు(36), కర్ర రాంబాబు(30) ఇద్దరు స్నేహితులు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. పంటల సాగుతో వచ్చే డబ్బులు సరిపోవడంలేదని మాదకద్రవ్యాలు విక్రయించాలని నిర్ణయించుకున్నారు.
తెలిసిన వారి ద్వారా డ్రగ్ వ్యాపారులను పరిచయం చేసుకుని మాదకద్రవ్యాలను కొని, అధిక ధరలకు అమ్ముతున్నారు. సోమవారం చంటి, లక్ష్మినాయుడు అనే వ్యాపారుల వద్ద 10.2 కిలోల హషీష్ ఆయిల్ కొనుగోలు చేసి విక్రయించడానికి హైదరాబాద్‌కు వచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు భువనగిరి ఎస్వోటీ బృందం, పోచంపల్లి పోలీసులతో కలిసి కొత్తగూడ క్రాస్ రోడ్డు అయ్యప్ప ఆలయం వద్ద ఆర్టీసీ బస్సులో నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.52 కోట్ల విలువైన 10.2 కిలోల హషీష్ ఆయిల్, 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
33.50 లక్షల గంజాయి స్వాధీనం
సంగారెడ్డి(విజయక్రాంతి): ఏపీలోని చిత్తూరు జిల్లా పుంగనూర్ మండలం ఈటవాకిలికి చెందిన ఆఫీజ్ ఒడిశా నుంచి మహారాష్ట్రకు కారులో గంజాయిని తరలిస్తున్నాడు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోలోగేట్ వద్ద ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వాహనాల తనిఖీ చేయగా నిందితుడు పట్టుబడ్డాడు. కారులో రూ.33.50లక్షల విలువైన 83.4 కిలోల గంజాయి, రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
ధూల్‌పేట్‌లో ఇద్దరి అరెస్టు
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): ధూల్‌పేట్‌లోని మాచిపురలో దినేష్‌సింగ్ అనే వ్యక్తి ఇంట్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేశారు. 1.2కిలోల గంజా యిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్ట్ చేశారు. తనిఖీల్లో సీఐ గోపాల్, ఎస్సై విష్ణుగౌడ్, సిబ్బంది భాస్కర్‌రెడ్డి, శ్రీధర్, అజీమ్, ప్రకాశ్, మహేష్, రాకేష్ పాల్గొన్నారు.
నిజామాబాద్‌లో ముగ్గురి అరెస్ట్
నిజామాబాద్(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు ఎక్సైజ్ సీఐ వెంకటేషన్ ఆధ్వర్యంలో దాడులు చేశా రు. ఒకరు పోలీసులకు చిక్కగా ఒకరు పరారయ్యారు. 250 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని 450 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
నిర్మల్‌లో ఒకరి అరెస్టు
నిర్మల్(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న అమీర్ సోయల్‌ను మంగళవారం అరెస్టు చేసినట్టు నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు.
కారుకు ఫేక్ నంబర్ ప్లేట్‌తో..
ఇబ్రహీంపట్నం: కారుకు ఫేక్ నంబర్ ప్లేట్‌ను అమర్చి గంజాయి రవాణ చేస్తున్న నిందితులను పోలీసులు పట్టుకున్నారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన వాల్మీక్ రూపమోహిత్, బతుదేవ్‌రాం ఏపీలోని అరకు ప్రాంతం పెద్దుర్తికి చెందిన తిరుపతి వద్ద గంజాయిని కొని అమ్ముతున్నారు. ఈ నెల 25న పెద్దుర్తికి వెళ్లి తిరుపతి వద్ద 60 కిలోల గంజాయిని వాల్మీకి రూపమోహిత్, బతుదేవ్‌రాం కొన్నారు.
పోలీసుల దృష్టి మరల్చేందుకు కారుకు నకిలీ నంబర్ ప్లేట్‌ను అమర్చి రాజమహేంద్రవరం, విజయవాడ, సూర్యాపేట, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం మీదుగా మహారాష్ట్రలోని నాసిక్‌కు ప్రయాణం ప్రారంభించారు. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు, మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసులు మంగళవారం ఉదయం ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోల్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 60 కిలోల గంజాయి, కారు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సుధీర్‌బాబు తెలిపారు.