21-04-2025 01:53:28 AM
నిజామాబాద్, ఏప్రిల్ 20 :(విజయక్రాంతి): రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 23 వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైతు మహోత్సవం నిర్వహించనున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.
జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే మహోత్సవాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు , ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఉదయం 11.00 గంటలకు ప్రారంభిస్తారని అన్నారు.
మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో రైతులు వారు పండించిన ఉత్పత్తులతో పాటు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులు సైతం ప్రదర్శనలో ఉంచనున్నారని, సుమారు 150 స్టాల్స్ ఏర్పాటు చేయడంజరిగిందని వివరించారు.
వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖల శాస్త్రవేత్తలు, నిపుణులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు నూతన వ్యవసాయ పద్ధతులపై మూడు రోజుల పాటు వర్క్ షాపు నిర్వహించనున్నారని కలెక్టర్ తెలిపారు. పురస్కారాలు అందుకున్న అభ్యుదయ రైతులతో పాటు రైతు ఉత్పాదక సంస్థలు తమ అనుభవాలు పంచుకునేందుకు రైతు మహోత్సవం వేదికగా నిలవనుందని అన్నారు.