హైదరాబాద్, నవంబర్ ౪ (విజయక్రాంతి): రాష్ర్టవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్‌ను ప్రత్యేక అధికారిగా నియమించింది.
ఈ నేపథ్యంలో రైతులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపట్టాలని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించి, ఏ విధమైన సమస్యలున్నా అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు.
ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేందుకు ప్రత్యేకాధికారులు
ప్రత్యేకాధికారులు జిల్లాలు
కృష్ణ ఆదిత్య ఆదిలాబాద్, నిర్మల్,
కుమ్రంభీం అసిఫాబాద్, మంచిర్యాల
ఆర్వీ కర్ణన్ కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల
అనితా రామచంద్రన్ నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట
డా. ఏ శరత్ నిజామాబాద్, కామారెడ్డి
డీ దివ్య రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి
జీ రవి మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి,
జోగులాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్
టీ వినయ కృష్ణారెడ్డి వరంగల్, హనుమకొండ, జనగాం, జయశంకర్
భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్
హరిచందన దాసరి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట
కే సురేంద్ర మోహన్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం
ఊపందుకోని ధాన్యం కొనుగోళ్లు
- 5,127 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్
- కొన్న ధాన్యం 18,800 మెట్రిక్ టన్నులే
- ప్రణాళికలో వైఫల్యం.. రైతులకు ఇబ్బందులు
హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాం తి): దేశంలోనే అత్యధికంగా ధాన్యం దిగుబడి ఉంటున్న రాష్ట్రంగా తెలంగాణకు పేరు ఉన్నది. కానీ రైతుల నుంచి ఆ స్థాయిలోనే ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని, ప్రణాళికలోనే లోపం ఉందనే వాదనకు పరిస్థితులు అద్దం పడుతున్నాయి. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భారీగా వరి సాగు..
ఈ వానకాలంలో రాష్ట్రంలో 66.73 లక్ష ల ఎకరాల్లో వరి సాగు అయినట్టు వ్యవసా యశాఖ గణాంకాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నరకాలకు రూ.500 బోనస్‌ను ప్రకటించడంతో రైతులు సన్నాల సాగుపై దృష్టి సారించారు. వర్షాకాలంలో 140 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచ నా వేశారు. ఇందులో 58 శాతం సన్నరకాలే సాగు చేసినట్టుగా వ్యవసాయశాఖ చెబుతోంది. అంటే 80 నుంచి 85 లక్షల టన్నుల ధాన్యం సన్నరకాలే ఉండే అవకాశం ఉంది.
సీఎం సమీక్ష..
అక్టోబర్ 3న సీఎం రేవంత్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖాధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. మొత్తం 140 లక్షల టన్నులకుపైగా వచ్చే ధాన్యంలో సుమారు 91 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. ఇందులో 44 లక్షల టన్నుల దొడ్డురకం ధాన్యం, 47 లక్షల టన్నుల సన్నరకం ధాన్యం కొనుగోలు చేయాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. అదేస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఎంకు అధికారులు విన్నవించారు.
కొనుగోళ్లపై నిర్లక్ష్యం..
అయితే నెలరోజులకుపైగా సమయం గడిచినా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. అక్టోబర్ మొదటివారం నాటికే ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో వరికోతలు ఊపందుకున్నాయి. కానీ అధికారులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలోనూ, ధాన్యం కొనుగోళ్లపై మొదటినుంచి అంతగా ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రంలో మొత్తం 7,735 ధాన్యం కొనుగోలు కేంద్రాలకుగాను 5,127 కేంద్రాలు మాత్రమే ప్రారంభించారు.
నవంబర్ 2 నాటికి 18,7970 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. అంటే 18,797 టన్నులన్నమాట. ఎక్కడ 91 లక్షల మెట్రిక్ టన్నులు.. ఎక్కడ 18,800 మెట్రిక్ టన్నులు. అదికూడా గడిచిన నెలరోజుల్లో కొనుగోలు చేసిన ధాన్యం. 91 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలంటే కనీసం 480 రోజులు పడుతుంది. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేయడానికే ఇంత సమయం పడితే.. ఇక రబీ ధాన్యం కొనుగోలు చేయడానికి ఎంత సమయం పడుతుందనేది అధికారులకే తెలియాలి.
రైతులకు చెల్లించింది 4.04 కోట్లే..
ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షిస్తూ రూ. 30 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రకటించారు. కానీ నవంబర్ 2 నాటికి పరిస్థితి చూస్తే కేవలం 2,546 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన 18,800 టన్నుల ధాన్యానికి సంబంధించి ఇప్పటివరకు రైతులకు చెల్లించింది కేవంల రూ. 4.04 కోట్లు మాత్రమే. కొనుగోలు చేసిన ధాన్యం విలువ సుమారు రూ. 50 కోట్ల వరకు ఉండగా.. ఇందులో 10 శాతంకూడా చెల్లింపులు జరగలేదు.
ప్రైవేటు వ్యాపారులే దిక్కు..
కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకపోవడంతో రైతులు వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టు గా ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా ప్రైవేటు వ్యాపారుల కొనుగోలు హడావుడి కనపడుతున్నది. మిల్లర్ల అక్రమాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల ప్రణాళికపై దృష్టి సారించలేకపోయింది.
కోతలకు ముం దే రైస్ మిల్లర్లతో ఒప్పందాలు పూర్తి చేసుకుని ఉండాలి. కానీ అలా చేయలేదు. గతంలో డిఫాల్టర్లయిన రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవడంపై కసరత్తు చేశారు. కానీ సరైన సమయంలో కొనుగోలు చేయకపోతే రైతులు ఇబ్బందులు పడతారనేది ఊహించలేదు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోళ్లపై సమీక్షిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం నానాటికి తీసికట్టుగా కనపడుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితుల పరిష్కారానికిచర్యలు తీసుకోవడంలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనపడుతోంది.