calender_icon.png 25 October, 2024 | 11:52 AM

కదం తొక్కిన కర్షకులు.. కాంగ్రెస్ సర్కారుపై కన్నెర్ర

29-08-2024 05:28:39 PM

కాంగ్రెస్ సర్కారుపై కన్నెర్ర 

కట్టలు తెంచుకున్న ఆగ్రహం 

అన్నదాతలు రోడ్డెక్కారు...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుడిపై ప్రమాణం చేశారు.. మాకు పంగనామాలు పెట్టారు

రైతుల ప్రభుత్వమంటూ రోడ్డు పాలు చేశారు..

రుణమాఫీ,రైతు భరోసా ఏదీ..?

భారీగా తరలివచ్చిన రైతుల ధర్నా, రాస్తారోకో ..

జగిత్యాల, (విజయక్రాంతి): కదం తొక్కిన కర్షకులు కాంగ్రెస్ సర్కారుపై కన్నెర్ర చేసి కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో అన్నదాతలు రోడ్డెక్కారు. సీఎం దేవుడిపై ప్రమాణం చేసి పంగ నామాలు పెట్టి రైతుల ప్రభుత్వ మంటూ రోడ్డు పాలు చేశారని రుణమాఫీ, రైతు భరోసా ఏదీ..? భారీగా తరలివచ్చిన రైతులు జగిత్యాల జిల్లా మేడిపల్లిలోని ప్రధాన రహదారిపై గురువారం ధర్నా రాస్తారోకో చేశారు. దేవుడిపై ప్రమాణం చేసి రైతులకు అండగా ఉండి రుణమాఫీ చేస్తానని, రైతు భరోసా అందిస్తానని ఎన్నికలకు ముందు హామీలిచ్చి గద్దెనెక్కాక  రైతు ప్రభుత్వo అని చెబుతూ రైతులకు పంగనామాలు పెట్టి రోడ్డు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీ తంగా తరలొచ్చిన రైతులు ఐక్యతను చాటుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రెండు లక్షల రైతు మాఫీ చేయాలని, పట్టా పాసుబుకులు కలిగి బ్యాంకులో రుణాలున్న రైతుకు రుణమాఫీ చేయాలని,రైతు భరోసా ఎకరా కు రూ.15000ఇస్తామనే మాట నిలుపుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం  చేసిందని  రైతులు ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేశారు.

రైతులను అడ్డం పెట్టుకొని అండగా ఉంటామని ఇచ్చిన హామీని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. అన్నదాతలు ఆందోళన బాట పట్టాల్సివచ్చిందని అన్నారు. అందరికీ అన్నం పెట్టే అన్నదాత ఎన్నో కష్టాలకోర్చి వ్యవసాయం చేస్తే కర్షకుల కష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించలేకపోవడం సిగ్గుచేటని అన్నారు. రైతులకు ఇవ్వాళ జరుగుతున్న మోసం కాదని తరతరాలుగా రైతులు మోసానికి గురవుతున్నాడని, మోసపోవడం తప్ప మోసం చేయడం ఎరుగని రైతన్నలతో ప్రకృతి చెలగాటం ఆడుకుంటూ ఉందన్నారు. అన్నం పెట్టే రైతు  పంటలు పండించుకోవడానికి చేసిన రుణం తీర్చలేకపోవడం, ప్రభుత్వాలు భరోసా కల్పిస్తాం అన్న మాటలు నీటి మూటలే అయ్యాయని పాలకుల మాట విని పంటలకు కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య లు చేసుకుంటున్న సంఘటన లు కోకొల్లలు ఉన్నాయన్నారు. దీనిపై నాయకులు,అధికారులు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రైతుల శ్రేయస్సుకు చేయకపోవడం బాధాకరమన్నారు.

తాము తలుచుకుంటే మోసం చేసిన  ప్రభుత్వాలను కూకటి వేళ్లతో పెకిలించే శక్తి ఉందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చేస్తున్న తప్పుల సరిదిద్దుకొని రైతులకు ఇచ్చిన హామీలు రెండు లక్షల రుణమాఫీ, ప్రతి ఒక్క రైతుకు ఏ షరతులు లేకుండా మాఫీ, రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తామన్న హామీ కూడా వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. మేడిపల్లి మండలం విలయతాబాద్ కు  చెందిన పెద్ద గంగారం ఖాతాలో రైతు రుణమాఫీ డబ్బులు పడ్డా ఖాతాదారుడు మరణించాడని, నామినీ కి ఇవ్వరాదని బ్యాంక్ మేనేజర్ నిరాకరించాడన్నారు. బోదాస్ గంగాధర్ రైతుల ధర్నా లో తహసీల్దార్ వసంత తో తన భాదను వెలిబుచ్చాడు.తగిన చర్యలు తీసుకొని డబ్బులు ఇప్పించాలని వేడుకొన్నాడు.

ప్రభుత్వం పట్టించుకోకుండా రైతులను ఇబ్బంది పెడితే రాష్ట్రం మొత్తం స్తంభించేలాగా ఉద్యమాలు కొనసాగుతాయని హెచ్చరించారు. అనంతరం మేడిపల్లి తాసిల్దార్ వసంతకు, అలాగే వ్యవసాయ అధికారి సాహిద్ ఆలికి రైతులు వినతి పత్రం అందజేశారు. జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి, మేడిపల్లి, కోరుట్ల, కథలాపూర్ ఎస్సైలు శ్యామ్ రాజ్, శ్రీకాంత్, శ్వేత, నవీన్, పోలీసు సిబ్బంది అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు.