calender_icon.png 27 November, 2024 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సదస్సును విజయవంతం చేయాలి

27-11-2024 01:54:18 AM

  1. 30న  కనీసం లక్ష మంది రైతులతో సదస్సు
  2. మంత్రులు తుమ్మల, జూపల్లి, దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, నవంబర్ 26 (విజయ క్రాంతి): ఈనెల 28, 29, 30 తేదీల్లో మహబూబ్‌నగర్‌లో నిర్వహించే రైతు సదస్సును విజయవంతం చేయాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ సూచించారు. సదస్సు నిర్వహణ కోసం అధికారులు, ప్రజా ప్రతినిధులు కలసి పనిచేయాలని అన్నారు.

మహబూబ్‌నగర్ రైతు సదస్సు ఏర్పాట్లపై మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాష్ర్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నారెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి, రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్, కలెక్టర్లు, ఎస్పీలు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ  ఏడాది కాలంలో రాష్ర్ట ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక మొత్తం నిధులు కేటాయించిందన్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీతో రాష్ర్టంలోని ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గంలో కనీసం 20 నుంచి 30 వేల మంది రైతులకు లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు.

మొదటిరోజు సదస్సుకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రైతులు హాజరవుతారని, 29న ఇతర ప్రాంతాల నుంచి రైతులు హాజరవుతారని తెలిపారు. 30న రాష్ర్టంలోని అన్ని జిల్లాల నుంచి కనీసం లక్ష మంది రైతులు సదస్సుకు హాజరవుతారని, ఈ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.

ఆధునిక వ్యవసాయ యంత్ర సామాగ్రి, వివిధ రకాల పంట రీతులు, హైబ్రిడ్ వంగడాలు, ప్రభుత్వం అమలుచేస్తున్న పలు పథకాలపై ప్రదర్శన స్టాళ్ళను సంబంధిత శాఖలు ఏర్పాటు చేస్తాయని తెలిపారు. మూడురోజుల కార్యక్రమాలను రాష్ర్టంలోని 560 రైతు వేదికల ద్వారా లైవ్ ప్రసారం చేయాలని ఆదేశించారు. 

సదస్సుకు వాహనాల పార్కింగ్, ట్రాఫిక్, స్టాళ్ల ఏర్పాటు, రైతులకు అవగాహన తదితర కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టాలని సీఎస్ శాంతికుమారి తెలిపారు. సమీక్షలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డా.శ్రీహరి, మేఘా రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, పర్ణీకారెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి,  ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస రాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జీఏడీ కార్యదర్శి రఘునందన్, టీజీఎస్పీడీసీఎల్ ముషారఫ్ అలీ ఫరూఖీ, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.