calender_icon.png 22 April, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల చుట్టం.. భూభారతి చట్టం

22-04-2025 01:26:15 AM

  1. పైరవీలు.. మధ్యవర్తుల దందాకు తావు లేదు..
  2. సేవలు పూర్తిగా ఉచితం 
  3. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి
  4. నల్లగొండ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అవగాహన సదస్సులు
  5. సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని చందంపేటలో ఆర్డీవోపై మంత్రి ఆగ్రహం
  6. భూసమస్యల శాశ్వత పరిష్కారం కోసమే పోర్టల్

మేడ్చల్ అర్బన్/ఇబ్రహీంపట్నం/ దేవరకొండ, ఏప్రిల్ 21: భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నదని రాష్ట్ర రెవెన్యూశాఖ మం త్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్ఘాటించారు. భూభద్రత కోసమే సర్కార్ ఈ చట్టాన్ని అమ లు చేస్తున్నదని, చట్టం రైతులకు చుట్టం లాంటిదని అభివర్ణించారు.

నల్లగొండ జిల్లాలోని చందంపేట, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంతోపాటు మేడ్చల్ జిల్లాకేంద్రంలో సోమ వారం నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులకు మంత్రి హాజరయ్యారు. ఆయా సదస్సుల్లో మంత్రి మాట్లాడుతూ.. భూసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తం గా నాలుగు మండలాలను ఎంచుకుని, అక్కడ పైలెట్ ప్రాజెక్ట్‌గా భూభారతి పోర్టల్‌ను అమలు చేస్తున్నామని వెల్లడించారు.

జూన్ 2వ తేదీ నుంచి ప్రతి గ్రామానికి తహసీల్దార్ స్థాయి అధికారులు వెళ్లి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారని, అందుకు రైతుల ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. భూసర్వే కోసం ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 6 వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించిందని స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి ఒక గ్రామ పరిపాలన అధికారి చొప్పున 10,695 మందిని ఎంపిక చేశామని తెలిపారు. 

ప్రతి మనిషికి ఆధార్ ఉన్నట్లే, త్వరలో భూమి యాజమానికి భూదార్ కార్డు అందజేస్తామని తెలిపారు. కొత్త చట్టం వచ్చాక పైరవీలు అవసరం లేదని, మధ్యవర్తల ప్రమేయానిక తావేలే దన్నారు. నిన్నమొన్నటివరకు భూములు అమ్మినా, కొన్నా మ్యాపింగ్ లేదని, ఇకపై రాష్ట్రంలో ఎక్కడ భూరిజిస్ట్రేషన్ అయినా.. వెంటనే మ్యాపింగ్ అనుసంధానమవుతుందని తేల్చిచెప్పారు.

గత ప్రభుత్వం సాదా బైనామాలను పక్కకు నెట్టిందని, కానీ.. తమ ప్రభుత్వం సాదాబైనామా సమస్యలను సైతం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల పైచిలుకు దరఖాస్తులు అందాయని, వాటిని న్యాయబద్ధంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

భూభారతి విషయంలో రైతులు ఎలాంటి అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దని మంత్రి సూచించారు. గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టల్‌తో భూసమస్యలకు పరిష్కారం లభించలేదని, తమ ప్రభుత్వం వాటన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రజాప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు. 

దేవరకొండ ఆర్డీవోపై మంత్రి ఆగ్రహం..

నల్లగొండ జిల్లా చందంపేట భూభారతి అవగాహన సదస్సుకు విచ్చేసిన మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి స్థానిక రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకొచ్చారు. రెవెన్యూశాఖ నుంచి ఎదుర్కొంటున్న భూసమస్యలకు పరిష్కారం చూపడం లేదని వాపోయారు. దీంతో మంత్రి స్పందించారు. భూసమస్యలకు ఎందుకు పరిష్కారం చూపడం లేదని దేవరకొండ ఆర్డీవో రమాణారెడ్డి, ఆయా మండలాల తహీసీల్దార్లను ప్రశ్నించారు.

వారి నుంచి మౌనమే సమాధానం రావడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ డివిజన్‌లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహనా రాహిత్యం పనికి రాదని ఆర్డీవోను మందలించారు. ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.