22-12-2024 01:03:30 AM
* అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): రైతు పిల్లలకు 90 శాతం రాయితీతో కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం, విద్యాసంస్థల్లో చదువు అందించాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. రాష్ట్రంలో ఏ రైతు సంతోషంగా లేడని తెలిపారు. రైతులు అప్పు కోసం బ్యాంకులకు వెళ్తే భూములను తనఖా పెట్టుకొని రుణాలిస్తున్నారన్నారు. రైతు సొంత ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పొలంలోకి ఎరువులు, కూలీలను తీసుకుపోవాలంటే గ్రామాల్లో సరైన రోడ్లు లేవని, వచ్చే బడ్జెట్‌లో రోడ్ల కోసం నిధులు కేటాయించాలని కోరారు. రైతు కుటుంబమంతా కష్టపడినా ఏడాదికి రూ.50 వేలు సంపాదించలేకపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా అంటే కేవలం డబ్బులు ఇవ్వడమే కాదని, రైతు బతుకుకు అన్ని విధాలా భరోసా ఇవ్వాలన్నారు. కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఇప్పటికీ 60 శాతం పైగా రుణమాఫీ కాలేదన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మాటలు వింటుంటే 2014 కంటే ముందు తెలంగాణలో వ్యవసాయం, రైతులు లేనట్లుందన్నారు. భూమి శిస్తు మీదనే ఆధారపడి ఆనాడు పాలన సాగేదన్నారు. రైతులకు వ్యవసాయ పరికరాలను అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.