నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం: కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): వ్యవసాయరంగంలో ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లను ప్రోత్సహించేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2021లో అగ్రిహబ్‌ను ఏర్పాటు చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ వ్యవసాయం, అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి ఈ హబ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అగ్రిహబ్ దేశంలోనే వ్యవసాయ రంగంలో తొలి ఇంక్యుబేటర్‌గా గుర్తింపు పొందిందని తెలిపారు.
న్యాయమడిగితే కర్కశత్వమా!
న్యాయం చేయమన్నందుకు దళితులపై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తుంటే కాంగ్రెస్ పాలనలో సామాన్యులకు ఇబ్బందులకు తప్పేలా లేవని అర్థమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని జటప్రోల్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ గురుకుల బిల్డింగ్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల భూమిని ఎంచుకుందని, అన్యాయంగా తమ భూమిని తీసుకోవద్దని, న్యాయం చేయమని అడిగిన దళితులను సెక్యూరిటీతో గెంటించేశారన్నారు. మరో విషయమై కేటీఆర్ స్పందిస్తూ పసిబిడ్డల ప్రాణాలకు సైతం రాష్ట్ర ప్రభుత్వం విలువనివ్వడం లేదని మండిపడ్డారు. ఎంతో మందికి ప్రాణం పోసి న గాంధీ ఆసుపత్రిలో 48 మంది పసిప్రాణాలు పోవడం వల్ల వారి తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలిందన్నారు.