29-04-2025 12:38:52 AM
జగిత్యాల, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): సన్న వడ్లకు రాష్ర్ట ప్రభుత్వం అదనంగా ఇస్తున్న రూ. 5 వందల బోనస్ వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని జగి త్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని 15వ వార్డు శంకులపల్లిలో మెప్మా ఆధ్వర్యంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్న వడ్లు పండించే రైతులను ప్రోత్సహించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 5 వందల అదనపు బోనస్ అందిస్తున్నదని, దీంతో రైతులకు మరింత లబ్ధి చేకూరుతుందన్నారు. 15వ వార్డులో రూ. 85 లక్షలతో అత్యంత అవసరమైన డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. వార్డులో వాటర్ ట్యాంక్ ఏర్పా టుతో మంచినీటి సరఫరా మరింతగా మెరుగైందన్నారు.
జగిత్యాల అభివృద్ధి కోసమే తాను రాష్ర్ట ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. జగిత్యాలలో చేపట్టిన డబల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం నిరుపేదలకు వరం లాంటిదన్నారు. పట్టణ సమస్యల పరిష్కారానికి అలుపెరగకుండా నిరంతర కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ స్పందన, మాజీ చైర్మన్లు గిరి నాగభూషణం, అడువాల జ్యోతి లక్ష్మణ్, గోలి శ్రీనివాస్, నాయకులు బాల ముకుందం, తోట మల్లికార్జున్, మెప్మా ఏవో శ్రీనివాస్, ఏఈ అనిల్ తదితరులు పాల్గొన్నారు.