calender_icon.png 7 January, 2025 | 3:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ లబ్ధికోసమే రైతుభరోసా

06-01-2025 01:03:56 AM

  1. 15 వేలపెట్టుబడి సాయం రూ.12 వేలు ఎందుకైంది?
  2. రైతు ద్రోహి రేవంత్‌రెడ్డి
  3. ఏడాదిలోనే రాష్ట్రం దివాళా
  4. సీఎం అనాలోచిత నిర్ణయాలే కారణం
  5. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే సీఎం రేవంత్‌రెడ్డి రైతుభరోసా నాటకమాడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల ముందు కు ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడిసాయం అందిస్తానని మాట ఇచ్చి, ఇప్పుడు కేవలం రూ.12 వేలు ఇస్తామని ప్రకటించడం సిగ్గుచేటన్నారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటేసిన పాపానికి రైతులను సీఎం పచ్చి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి రైతుద్రోహిగా నిలిచిపోతాడన్నారు. రైతులను ద్రోహం చేసినందుకు సీఎం ప్రజాక్షేత్రంలో ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.

ఈ మోసం రాష్ట్ర చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కపట నాటకాలు, పచ్చి అబద్ధాలు, బూటకపు వాగ్దానాలకు కేరాఫ్‌గా మారిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అబద్ధాలకు డిక్షనరీలో కొత్త పదాలు కనిపెట్టాలని ధ్వజమెత్తారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు రావాలంటేనే భయంగా ఉంద ని ఎద్దేవా చేశారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల పరిస్థితులు బాగుండేవని సాక్షా త్తు సీఎం అభిప్రాయం వ్యక్తం చేయడం సబబు కాదన్నారు. సీఎం పదవిలో కూర్చొ ని తెలంగాణను కించపరచడం సిగ్గుచేటన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ వంటి అనేక గొప్ప కార్యక్రమాలను నాడు బీఆర్‌ఎస్ చేపట్టిందని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన ఏడాది కాలంలోనే రాష్ట్రం దివాళా తీసిందని ఎద్దేవా చేశారు.

సీఎం మతిలేని నిర్ణయలతోనే తెలంగాణ ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైందని ఆరోపించారు. హైడ్రా, మూసీ సుందరీకరణ నిర్ణ యాలతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని విమర్శించారు. సంవత్సరం లో రూ.లక్షా 38 వేల కోట్ల అప్పు చేసి కాంగ్రెసోళ్లు ఢిల్లీకి సూటికేసులు మోశారని ఆరో పించారు.

కానీ, గత ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పు చేసి ప్రజలకు పంచారని గుర్తు చేశా రు.  రూ 5,943 కోట్ల రెవెన్యూ మిగులుతో తాము రాష్ట్రాన్ని అప్పగించామని, సీఎం రేవంత్ దివాళాకోరు నిర్ణయాలతోనే అప్పులపాలైందన్నారు.

నేడు బీఆర్‌ఎస్ నిరసనలు

రైతులకు రైతుభరోసా అందించాలనే నినాదంతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, నిరసనలో రైతులను భాగస్వాములను చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రాలు, మండల కేంద్రాలు, నియోజకవ ర్గకేంద్రాల్లో నిరసనలు హోరెత్తాలని సూచించారు. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను తిరగనీయకుండా అడ్డుకుని పంచాయతీ ఎన్నికల్లో మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు.