calender_icon.png 14 November, 2024 | 4:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతులు

13-11-2024 06:26:17 PM

రామయంపేట (విజయక్రాంతి): మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ తొనిగండ్ల మెదక్ ప్రధాన రహదారిపై రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఝాన్సీలింగాపూర్, తోనిగండ్ల గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి నెల రోజులు గడుస్తున్నా నెల రోజుల నుండి నాలుగు ధాన్యం లారీలు వెళ్లాయని అన్నారు. మార్కెట్ యార్డ్ అధికారులకు ఫోన్ చేసి చెప్పిన ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం అలాట్మెంట్ ఇస్తే కొనుగోలు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం తేమ శాతం 17 ,18 ఉంటే కొనుగోలు చేశారని పేర్కొన్నారు.

ఇప్పటి ప్రభుత్వం 12 ,13 శాతం తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ విషయంలో రైతులు పరేషాన్ అవుతున్నారని పేర్కొన్నారు. అదే విధంగా రైస్ మిల్లర్లలో ధాన్యం పట్టడం లేదని అధికారులు చెబుతున్నారని తెలిపారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తి పాడవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు స్పందించి వెంటనే రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పిట్ల రాణేమ్మ భూలింగం, గ్రామ మాజీ సర్పంచ్లు పేగుడ సిద్ధరాములు, పిట్ట స్వామి, బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు అమ్మన్నగారి సిద్ధ రాములు, ఆటిగారి శంకర్, అటిగారి రాజు, పిట్ల పోచయ్య, బి.అనిల్, అటిగారి సంజీవులు, పోలీసు చంద్రశేఖర్ గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.