calender_icon.png 2 November, 2024 | 3:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారులపై తిప్పలు పెడుతున్న మక్కలు

02-11-2024 01:11:36 PM

పినపాక: రహదారులపై రైతులు మొక్కజొన్నలను ఆరాబోస్తుండడంతో వాహనదారులకు, ప్రయాణీకులకు అసౌకర్యంతో పాటుగా తీవ్ర ఇబ్బందులు నెలకొనే పరిస్థితి ఏర్పడుతుంది. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలోని గుండాల, కరకగూడెం, ఆళ్లపల్లి మండలాలలో రైతులు పండించిన మొక్కజొన్నలను ఎండబెట్టడానికి రహదారులపై ఆరబోస్తున్నారు. దీంతో భారీ వాహనాలైన బస్సులు, లారీలు ఎదురుగా వచ్చినప్పుడు ద్విచక్ర వాహనాలు, టాటా మ్యాజికులు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. అసలే చలికాలం కావడంతో చీకటి వేళల్లో, తెల్లవారుజామున దట్టమైన పొగ మంచుతో రహదారులపై ప్రమాద భరితంగా ఉన్న మొక్కజొన్న రాశులు కనిపించక పెను ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. దానికి తోడు  మక్కలను ఆరబోసిన రైతులు రాత్రి వేళలో రహదారులపైనే మంచాలు వేసుకొని నిద్రిస్తున్నారు.

రాత్రి వేళలో ప్రయాణించే భారీ వాహనదారులకు ఇటు రహదారులపై నిద్రించే వారికి కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రహదారులపైనే మక్కలను ఆరబోసి, అక్కడే కాటా వేసి, వాహనాలలో లోడింగ్ చేస్తున్నారు. కొందరైతే ఆరిపోయిన మక్కలను బస్తాలలో వేసి రోడ్డు మీదనే ఉంచుతున్నారు. తారు రోడ్డు కావడంతో కొంచెం ఎండ తగిలినా తారు ప్రభావంతో వేడికి మక్కలలో ఉన్న తేమ పూర్తిగా ఆవిరి అయిపోతుందని వారు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. భారీ నష్టం వాటిలితే కానీ ఇలా నిబంధనలకు విరుద్ధంగా మక్కలను ఆరబోయొద్దని వారికి అర్థమయ్యే పరిస్థితి. ఇలా అక్కడక్కడ వాటి బారిన పడి కొంతమంది మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. అధికారులు వారిని అప్పుడప్పుడు హెచ్చరిస్తే కొన్ని రోజులు రోడ్డుకు తాకకుండా గింజలను ఆరబోసినా, మళ్లీ షరా మామూలే అవుతుంది. ఇకనైనా అధికారులు స్పందించి రైతులకు తగు సూచనలు చేయాలని వాహనదారులు, ప్రయాణీకులు కోరుతున్నారు.