calender_icon.png 23 October, 2024 | 3:08 AM

రైతుల్ని నట్టేట ముంచిండ్రు!

23-10-2024 12:43:54 AM

  1. నాసిరకం విత్తనాలు అంటగట్టిన వ్యాపారులు
  2. 70 రోజులకే పొట్టదశకొచ్చిన వరి 
  3. ఆందోళనలో రైతన్నలు ముత్యం వెంకటస్వామి

మంచిర్యాల, అక్టోబర్ 22 (విజయక్రాం తి) : ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతులకు శఠగోపం పెట్టింది ఓ విత్తన కంపె నీ. నాసిరకం విత్తనాలు అంటగట్టి అన్నదాతలను నట్టేట ముంచింది. మహారాష్ట్రకు చెందిన ఆ కంపెనీ విక్రయించిన వరి విత్తనాలు సాగు చేసి రైతులు ఆగమయ్యారు.

70 రోజుల్లోనే సగానికి పైగా పొట్టదశకు రావడం, మిగితావి అలాగే ఉండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ విత్తనాలను మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, లక్షెట్టిపేటలో హోల్‌సేల్ డీలర్లు మండలాల్లోని డీలర్లకు సరఫరా చేయగా పెద్ద మొత్తం లో రైతులు నాటువేశారు. ప్రస్తుతం ముం దుగానే పొట్టదశకు రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. వాన కాలంలో జిల్లాలో 1,52,920.22 ఎకరాల్లో వరి సాగైంది.

నమ్మి సాగు చేస్తే..

రైతులకు అంటగట్టిన వరి విత్తనాలు నకిలీవా? కంపెనీ నుంచే వచ్చినవా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధిక లాభార్జనే ధ్యేయంగా కొందరు డీలర్లు నాసి రకం విత్తనాలను అంటగడుతున్నారు. బెల్లంపల్లి కోల్‌టెక్స్‌లోని ఒక ప్రధాన ఫర్టిలైజర్ నుంచి యశోద కంపెనీకి చెందిన విత్తనాలు బెల్లంపల్లి, భీమిని వ్యవసాయ డివిజన్లలోని మండలాల్లోని ఫర్టిలైజర్ దుకాణాలకు, రైతులకు విక్రయించారు. ప్రస్తుతం ఆ విత్తనాలు సమయానికి ముందే పొట్టదశకు వచ్చాయి. 

70 రోజుల్లోనే పొట్టదశకు 

సాధారణంగా ఫైన్, సూపర్ ఫైన్ వెరైటీ విత్తనాలు 150 నుంచి 160 రోజులకు పొట్టదశకు వస్తాయి. కానీ, బెల్లంపల్లి, భీమిని వ్యవ సాయ డివిజన్‌లలో 70 రోజుల్లోనే సగం పంట పొట్టకు రాగా, సగం సాధారణ స్థితిలో ఉండిపోయింది. ముందుగానే కంకి వంచడం తో మిగితావి కంకి దశకు వచ్చే సరికి పొట్ట దశకు చేరి పడిపోయే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని యశోద కంపెనీకి చెందిన జైశ్రీరాం వెరైటీ విత్తనాలు ౨ నెలల్లోనే పొట్టకు రావడం తో రైతులు ఆందోళన చెందుతున్నారు.  

అత్యధికంగా జైశ్రీరాం వెరైటీ సాగు 

జిల్లాలో అత్యధికంగా జైశ్రీరాం వెరైటీ పంట సాగు చేస్తున్నారు. యశోద కంపెనీకి చెందిన జైశ్రీరాం రకం పంట జిల్లాలో 49,112.11 ఎకరాల్లో సాగవుతుండగా, జై శ్రీరాం గోల్డ్ 3,159.03 ఎకరాల్లో సాగవుతున్నాయి. జై శ్రీరాం వెరైటీ బెల్లంపల్లి డివిజ న్‌లోని బెల్లంపల్లి, కాసిపేట, తాండూరు మండలాల్లో 7,794.18 ఎకరాల్లో,  భీమిని, కన్నెపల్లి, నెన్నెల, వేమనపల్లి మండలాల్లో 6,113.36 ఎకరాల్లో, భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లో 28,131.01 ఎకరాల్లో, దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్షెట్టిపేట, మంచిర్యాల, నస్పూర్ మండలాల్లో 7,072.36 ఎకరాల్లో సాగవుతున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. 

బయటకు రాకుండా రైతులతో బేరసారాలు 

నాసిరకం విత్తనాలతో పంట నష్టపోయిన విషయం వెలుగు చూడటంతో రైతులతో కంపెనీ ప్రతినిధులు, డీలర్లు బేరసారాలకు దిగుతున్నారు. రైతులకు నేరుగా ఫోన్ చేసి ‘మీకు నష్టం జరిగితే మేం కంపెనీ అధికారులతో మాట్లాడు తాం’ అంటూ మాయమాటలు చెప్తూ రైతులను మరోసారి మోసం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

పొలాలను పరిశీలించిన కంపెనీ సేల్స్ ఆఫీసర్ విత్తనాల సమస్యతో ఇలా అయ్యిందని, సైంటిస్టులను తీసుకువస్తామని, నష్ట పరిహారం ఇస్తామంటూ.. తాపకోమాట చెప్తున్నారు. సదరు కంపెనీ సేల్స్ ఆఫీసర్‌ను ‘విజయక్రాంతి’ సంప్రదించే ప్రయత్నించగా స్పందించలేదు. హోల్‌సేల్ డీలర్ సైతం సమస్యను దాటవేసే లా మాట్లాడారు. రైతులు విత్తనాల రశీదుతో ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని వ్యవసాయాధికారులు చెప్తున్నారు.

నమ్మించి ముంచుతుండ్రు 

సన్నవడ్లకు బోనస్ ఇస్తరంటే బెల్లంపల్లికి పోయి ఈ సన్న రకం యిత్తనాలు తెచ్చి నాటేసిన. రెండెకరాల్లో మొత్తం ఈ కంపనీవే పెట్టిన. ఎటు గాకుండ కొన్ని ఈనవట్టే, కొన్ని పొట్టకు రావట్టే.. ఒక పంట గిన్ని రకాలుగా కోతకస్తే ఏ పరక ఏరుకుంట కొయ్యాలి. పైగ పంటంత అయినంక ఎంత లాసైతే గంత కంపనీ కొత్తలిస్తదంటుండ్రు ఆ దుకాణపొల్లు. గొలకలు బాగస్తయని ఇచ్చి మమ్ముల నట్టేట ముంచిండ్రు. 

నర్సయ్య, బోయపల్లి, తాండూరు

ఒకే రకం విత్తనం మూడు రకాలుగా ఉంది 

సన్న రకం విత్తనాలు రూ.900 చొప్పున 9 బస్తాలు నెన్నెలలోని ఓ ఫర్టిలైజర్ దుకాణంలో కొని అలికిన. మొలక మంచిగానే వచ్చింది. మంచిగ వర్షాలు పడ్డప్పుడే నాట్లు వేసిన. నాటేసిన నెల కాంగనే 20 శాతం గొలుసు కంకి వచ్చింది. ఇంకొంత ఇప్పు డే పొట్టకచ్చింది. ఇంకొంత పంట పెరగనే పెరగలేదు. పిలకలు లేవు. ఫర్టిలైజర్ దుకాణం వద్దకుపోయి చూపించిన. కంపెనీ వాళ్లను, వ్యవసాయ అధికారులు పొలాన్ని చూసిండ్రు. విత్తనమే ఫాల్టు ఉందని చెప్పిండ్రు. 

తోట మధు, రైతు, నెన్నెల