గగ్గలపల్లి కేంద్రం ఎదుట రైతాంగం ఆందోళన
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): సీసీఐ కేంద్రాల్లో నిర్వాహకులు తేమ, తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని, పత్తి కొనుగోలుకు కొర్రీలు పెడుతున్నారని రైతులు వాపోయారు. నాగర్‌కర్నూల్ మండలం గగ్గలపల్లి సీసీఐ కొనుగోలు కేంద్రం ఎదుట మంగళవారం వారు ఆందోళన చేపట్టారు.
పత్తిని రోజుల తరబడి కేంద్రం ఉండేలా చేసి, చివరకు దళారులు, ఫెర్టిలైజర్స్ దుకాణ యజమానుల పత్తి మాత్రమే కొంటున్నారని ఆరోపించారు. తుఫాన్ కారణంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయని, దీంతో పత్తిలో కొంత తేమ చేరిందని వాపోయారు.
నిర్వాహకులు నాణ్యత నిర్ధారణను సక్రమం చేయడం లేదని ఆరోపించారు. దళారులు తెచ్చే పత్తిని మాత్రం ఎలాంటి షరతులు లేకుండానే మొదటి రకం నాణ్యత రేటు కట్టి కొంటున్నారన్నారు. దిక్కులేక తాము ప్రైవేటు వ్యక్తులకు పత్తిని అమ్ముకోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.