calender_icon.png 7 January, 2025 | 12:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగు భూములకే రైతు భరోసా

05-01-2025 01:49:18 AM

ప్రతి ఎకరాకు ఏడాదికి రూ. 12 వేలు  

జనవరి 26 నుంచి అమలు

పేద కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డుల మంజూరు

భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం

రైతులకు శుభవార్త

  1. ఆదాయ వనరులు పెంచడం..
  2. పేదలకు పంచడమే మా ప్రభుత్వ విధానం
  3. రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్లు, పరిశ్రమల భూములు, ప్రభుత్వం సేకరించిన.. రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఇవ్వం 

జర్నలిస్టులు: గత ప్రభుత్వం ప్రతి ఎకరాకు రైతు బంధు ఇచ్చింది కదా..  

ముఖ్యమంత్రి: గతంలో ఏమి జరిగిందో వెనక్కి వెళ్లితే.. కేసీఆర్ కుటుంబం వెయ్యి సంవత్సరాలు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.

  1. మూడు గంటల పాటు క్యాబినెట్ సమావేశం 
  2. వివరాలు వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం శనివారం  రైతులకు శుభవార్త తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాల యంలో దాదాపు మూడు గంటలపాటు  జరిగిన  మంత్రివర్గ సమావేశంలో మూ డు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  వ్యవసాయయోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా పథకం కింద ఏడాదికి రూ. 12 వేలు ఇవ్వాలని నిర్ణయించారు.

అలాగే భూమిలేని వ్యవసాయ  కుటుంబాలకు కూడా ‘ఇందిరమ్మ ఆత్మీయ పథకం’ కింద  ఏడాదికి రూ. 12 వేల చొప్పున ఇవ్వాలని, రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నెల 26 నుంచి వీటిని అమలుచేయాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర ఆర్థిక వెసులుబాటును బట్టి ఆదా య వనరులను పెంచడం.. పేదలకు పంచడమే తమ విధానమని సీఎం చెప్పా రు. ఎంత వెసులుబాటు ఉంటే అంత మేలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నదన్నారు.  కొత్త సంవత్సరంలో తెలంగాణ రైతాంగానికి  మంచి జరగాలని, వ్యవసా యం అంటే దండుగ కాదు.. పండుగగా చేయాలని తమ ప్రభుత్వం ముందుకెళుతోందని చెప్పారు.

ఇప్పటికే రైతు రుణమాఫీ చేశామని, ఇప్పుడు రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ. 12 వేలు ఇస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ. 10 వేలు మాత్రమే ఇస్తే.. తమ ప్రభుత్వం రూ. 12 వేలకు పెంచి ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.  భూమిలేని వ్యవసాయ కూలీలు.. ‘మాకు  భూమి లేకపోవడం శాపమా..? ప్రభుత్వం ఆదుకోకపోవడం మరో శాపమా..?’ అని, ఎన్నికల ముం దు తను, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క జరిపిన పాదయాత్రల సమయంలో భూమిలేని పేదలు తమ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారని సీఎం తెలిపారు.

అప్పుడే భూమిలేని పేదలను కూడా ఆదుకోవాలని నిర్ణ యం తీసుకున్నామని, ఇప్పుడు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం కింద భూమిలేని వారికి ఏడాదికి రూ. 12 వేలు ఇవ్వాలని క్యాబినెట్‌లో నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు.  రాళ్లు, రప్పులు, గుట్టలు, రోడ్లు, మై నింగ్ చేస్తున్న భూములు, ప్రభుత్వం సేకరించిన భూములు, నాలా కన్వెర్షన్, రియల్ ఎస్టేట్ భూములు, పరిశ్రమలకు సంబంధించిన భూములకు రైతు భరోసా కింద నిధు లు ఇవ్వమని సీఎం స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లోపా ల వల్ల ఇలాంటి భూములన్నింటికి నిధులు ఇచ్చారన్నారు. పరిశ్రమలు, రియల్‌ఎస్టేట్, ప్రభుత్వం సేకరించిన భూములు ఏమైనా ఉంటే.. వారు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సహకరించాలని రేవంత్‌రెడ్డి కోరారు. రెవె న్యూ అధికారులు గ్రామ సభలు నిర్వహించి రైతులకు ఈ విషయం వివరిస్తారన్నారు.

ఇక జనవరి 26 నుంచే కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది జనవరి 26 నుంచే  కావడంతో.. అదే రోజు నుంచి పథకాలను అమలుచేయాలని నిర్ణయం తీసుకు న్నట్లు వెల్లడించారు.

ఈ జనవరి 26తో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతుందని చెప్పారు. గత ప్రభుత్వం ప్రతి ఎకరాకు రైతుబంధు ఇచ్చిన విషయాన్ని మీడియా గుర్తుచేయగా..  గతంలో ఏమి జరిగిందో వెనక్కి వెళ్లితే.. కేసీఆర్ కుటుంబం వెయ్యి ఏళ్లు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి సమాధానమిచ్చారు. 

ఇవీ క్యాబినెట్ నిర్ణయాలు.. 

* పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయం. 

* సింగూరు ప్రాజెక్టు కెనాల్‌కు మంత్రి దామోదర రాజనరసింహ తండ్రి, దివంగత మాజీ మంత్రి రాజనరసింహ పేరు పెట్టాలని నిర్ణయం. 

* జూరాల నుంచి కృష్ణా జలాలతో మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తగా మరింత ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఉన్న మార్గాలు, ప్రత్యామ్నాయాలను పరిశీలించేందుకు టెక్నికల్ ఎక్స్‌ఫర్ట్ కమిటినీ నియమించాలని నిర్ణయం. ఎక్కడ నీటి లభ్యత ఉంది..? ఎక్కడి నుంచి  ఎంత నీటిని తీసుకునే వీలుంది..? ఎక్కడెక్కడ రిజర్వాయర్లు నిర్మించాలి..? ఇప్పుడు ప్రాజెక్టులకు మరింత నీటిని తీసుకునే సాధ్యాసాధ్యా లపై కమిటీ అధ్యయనం చేస్తుంది.

* మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ తాగునీటికి తరలించే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లు స్కీమ్ ఫేజ్ -2, ఫేజ్ -3కి గ్రీన్ సిగ్నల్ గతంలో 15 టీఎంసీలకు ప్రతిపాదించిన ఈ పథకాన్ని భవిష్యత్ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీలకు పెంచేందుకు ఆమోదం. 

* మున్షిపల్ కార్పొరేషన్‌గా కొత్తగూడెం.. అప్‌గ్రేడ్ చేసేందుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.