సర్వేతో సాగులో లేని భూములు వెలుగులోకి..
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలో రైతు భరోసా సర్వేతో సాగులో లేని భూములు వెలుగు చూస్తున్నాయి. శనివారం మణుగూరు మండలం, మున్సిపాలిటీ పరిధిలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా చేపట్టిన రైతు భరోసా సర్వేతో సాగులో లేని భూములు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే భూసేకరణ ద్వారా కొన్ని పంట భూములను సీతమ్మ సాగర్, బిటిపిఎస్, సింగరేణి పరిధిలోకి వెళ్ళగా ఇంకా అవి సాగులో ఉన్నట్లు చూపుతున్నారు. దీంతో ప్రభుత్వం నుంచి రైతుబంధును అక్రమంగా అనుభవించారు. ఈ సర్వేతో పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందిన మణుగూరు మండలంలో పలు పంట భూములను అనధికారిక వెంచర్లు వేసి ఫ్లాట్లుగా విక్రయించిన విషయం తెలిసింది. కాగా, అటువంటి భూములకు కూడా రైతుబంధు పడుతుందని విమర్శలు ఉన్నాయి. కొన్ని పంట భూముల్లో కమర్షియల్ భవనాలు నిర్మించినప్పటికీని రైతుబంధు పడుతూనే ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా పట్టణంలోని రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతంలో ఇటీవల నిర్మించిన ఓ ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన భూములకు రైతుబంధు పథకం వర్తిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పాటు పట్టణం నడి మధ్యలోనే కట్టువాగు పక్కన గతంలో ఉన్న నిమ్మ తోట ప్రాంతంలో కమర్షియల్ భవనాలు వెలసినప్పటికిని రైతుబంధు పథకం ఆ భూములకు వర్తిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా మండలంలోని పలు ప్రాంతాల్లో సాగులో లేకుండా గృహ నిర్మాణాలు చేపట్టిన భూములను అధికారులు పెద్ద మొత్తంలోనే గుర్తించినట్లు తెలిసింది. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సర్వేకు తక్కువ సమయం ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించలేకపోతున్నట్లు అధికారులు, సర్వే సిబ్బంది విచారం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం సర్వే అధికారులతో పాటు సిబ్బందిని పెంచి సమయాన్ని పొడిగిస్తే క్షేత్రస్థాయి పరిశీలన చేయవచ్చనే భావన సర్వ అధికారులు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సర్వేతో రాష్ట్ర ఖజానాకు రైతుబంధు పథకం నిధులు పెద్ద మొత్తంలో మిగిలేటట్లు ఉందని పలువురు రాజకీయ నాయకులు భావిస్తున్నారు.