calender_icon.png 23 October, 2024 | 6:52 AM

ఆస్తి తగాదాలతో రైతు ఆత్మహత్య

04-08-2024 03:27:59 AM

  1. కారకుడి ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళన
  2. రైతు కుటుంబీకులను నచ్చజెప్పిన పోలీసులు 
  3. కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డిలో ఘటన

కామారెడ్డి, ఆగస్టు 3(విజయకాంతి): ఆస్తి తగదా కారణంగా రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో శనివారం వెలుగు చూసింది. చిన్నమల్లారెడ్డి గ్రామానికి రవీందర్‌రెడ్డి(55)కి వారసత్వంగా కొంత భూమి రావాల్సి ఉంది. ఆ భూమి రవీందర్‌రెడ్డి చిన్నాన్న సత్యంరెడ్డి పేరుపై ఉన్నది. తనకు రావాల్సిన వాటాను తన పేరున చేయించాలని రవీందర్‌రెడ్డి కోరుతుండటంతో గత 20 సంవత్సరాలుగా ఇద్దరి మధ్య తగాదా నడుస్తున్నది. ఇటీవలే సత్యంరెడ్డిని రవీందర్‌రెడ్డి నీలదీయడంతో దేవునిపల్లి పోలీస్‌స్టేషన్‌లో సత్యంరెడ్డి ఫిర్యాదు చేయగా.. రవీందర్‌రెడ్డిపై కేసు నమోదైంది. తనకు న్యాయంగా రావాల్సిన వారసత్వ భూమిని అడిగినందుకు తనపైనే కేసు పెట్టించడంతో రవీందర్‌రెడ్డి మనస్తాపానికి గురయ్యాడు.

శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రవీందర్‌రెడ్డి తిరిగి రాలేదు. శనివారం ఉదయం గ్రామ శివారులోని పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని రవీందర్‌రెడ్డి విగత జీవిగా కనిపించాడు. రవీందర్‌రెడ్డి ఆత్మహత్యకు సత్యంరెడ్డినే కారణమని ఆరోపిస్తూ అతడి ఇంటి ఎదుట రవీందర్‌రెడ్డి మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. సత్యంరెడ్డిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి నచ్చజెప్పారు. మృతుడి భార్య ఎదుల్ల లలిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి సీఐ రామన్, ఎస్సై రాజు తెలిపారు. మృతుడికి భార్యతో పాటు కూతురు ఉన్నారు.