- 67లక్షల ఎకరాల్లో సాగు..
- 153 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి
- ఇది తెలంగాణ రికార్డు: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): వరి దిగుబడిలో తెలంగాణ రికార్డ్ సృష్టించిందని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఖరీఫ్‌లో 66.77లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావడం తెలంగాణ రైతాంగం సాధించిన ఘన విజయమన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన తెలంగాణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ధాన్యం కొనుగోళ్లు, ధాన్యం దిగుబడిని తెలుసుకున్న ఆయన ధాన్యం దిగుబడి ఘనత ముమ్మాటీకీ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మూడు బరాజ్‌లు పనిచేయకపోయినా వరి దిగుబడిలో సాధించిన ఈ రికార్డు.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందన్నారు.
రైతాంగానికి సర్కార్ వెన్నుదన్నుగా నిలుస్తోందనడానికి.. పెద్దమొత్తంలో పండించిన పంట నిదర్శమ న్నారు. రాష్ట్ర చరిత్రలోనే, యావత్ భారత దేశంలోనే ఇప్పటివరకు ఇంతమొత్తంలో ధాన్యం దిగుబడి అరుదైన రికార్డు అని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. తెలంగాణ ప్రాంతంలో ఇంతటి పంట పండిన సందర్భం లేదన్నారు.
ప్రభుత్వంతో మమేకమైన రైతాంగం అంకిత భావంతో చేసిన కృషితోనే ఈ విజయం సాధ్యపడిందన్నారు. అందుకు తెలంగాణ రైతాంగానికి అభినందనలు తెలిపారు. రైతాంగానికి చేయూతనందించడంలో నీటిపారుదల, వ్యవసాయశాఖ సిబ్బంది పాత్ర అమోఘమన్నారు.