హైదరాబాద్ : ఆగస్టులోపే మూడు దశల్లో రైతు పంట రుణమాఫీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. రేపు రూ.లక్ష వరకు ఉన్న రైతు రుణాలకు నిధులును రేపు రూ. 7 వేల కోట్లు నేరుగా రైతుల రుణ ఖాతాల్లోకి వెళతాయన్నారు. ఏ రాష్ట్రం కూడా ఒకే విడుతలో రూ. 31 వేల కోట్ల రుణమాఫీ చేయలేదని ఆయన పేర్కొన్నారు.
రేపు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో రైతు రుణమాఫీతో ఎక్కడికక్కడ పండగ వాతావరణంలో సంబురాలు జరపాలని సీఎం తెలిపారు. రైతువేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలని, ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో రైతులు జరుపుకునే వేడుకల్లో పాల్గొన్నాలన్నారు. సంక్షేమంపై ఈ ప్రభుత్వం ఇప్పటికే రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రూ.28 వేల కోట్లు మాఫీ చేయలేకపోయారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దెవా చేశారు.