- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
- రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ
- చిన్న, సన్నకారు రైతుకు మేలుచేయాలని పలు వర్గాల సూచన
ఖమ్మం, జూలై 10 (విజయక్రాంతి): ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్హులైన రైతులకే రైతుభరోసా అందిస్తామని రైతు భరోసా పథక రాష్ట్ర క్యాబినెట్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సన్న, చిన్నకారు రైతుల కు మేలు చేసే విధంగా రైతు భరోసా పథకంపై అభిప్రాయ సేకరణ కోసం బుధవారం ఖమ్మం కలెక్టరేట్‌లో భట్టి అధ్యక్ష తన ఉమ్మడి ఖమ్మం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో కమిటీ సభ్యులు, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
రైతులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొని రైతు భరోసాపై అభిప్రాయాలు, సూచనలు చేశారు. కౌలు రైతు లకు రైతు భరోసా వర్తింపజేయాలని, ఆదాయపు పన్ను చెల్లింపుదారులను మినహాయించాలని, ఏజెన్సీ ప్రాంతంలో భూ పట్టాలు లేని పేద రైతులకూ ఇవ్వాలని, సాగు భూములకే వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని పంటలకు బోనస్ వర్తింపజేయాలని కోరారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పథకాల అమలులో గత ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజల ఆమోదంతోనే రైతుభరోసా అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
కేంద్ర బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుందని, ఆ సమయంలోగా రైతుభరోసా పథకం అమలుపై విధివిధానాలు రూపకల్పన చేయాలన్న ఉద్దేశంతోనే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పడిందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. అర్హులైన రైతులందరికీ రైతుభరోసా అందించడానికి అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు. పేద రైతులకు పంటసాయం అందించేందుకే ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు సాగుతుందని తెలిపారు. గతంలో లాగా లోపాలు, ఆర్థిక నష్టాలు తలెత్తకుండా చిన్న, సన్నకారు రైతులకు చేయూతనిచ్చి ఆదుకోవాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు.
రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. నిజమైన రైతును అన్ని విధాల ఆదుకునేందుకే వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. మిగతా 9 ఉమ్మడి జిల్లాల నుంచి అందిన సమాచారాన్ని క్రోడికరించుకుని అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు రామసహాయం రఘురామిరెడ్డి, పోరిక బలరాంనాయక్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రామక్రుష్ణారావు, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు ముజమ్మిల్‌ఖాన్, జితేష్ వీ పాటిల్, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, రాందాస్‌నాయక్, తెల్లం వెంకట్రావ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్‌రావు, వ్యవసాయశాఖ అధికారులు విజయనిర్మల, బాబురావు పాల్గొన్నారు.