calender_icon.png 11 January, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు భరోసా 26 నుంచి

11-01-2025 01:10:34 AM

సేద్యభూములకు.. పంట వేసినా, వేయకపోయినా..

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇండ్లు, కొత్త రేషన్‌కార్డులు అప్పటినుంచే..

  1. 24లోగా గ్రామ సభలు పూర్తి చేయాలి 
  2. 6 తర్వాత ఆకస్మిక తనిఖీలు ఉంటాయి 
  3. ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు 
  4. కలెక్టర్ల పనితీరే ప్రభుత్వ పనితీరుకు కొలమానం 
  5. మీ పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవాలి 
  6. కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ 

* కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. కానీ కొంత మంది ఆఫీసుల్లో కూర్చుని పనిచేస్తే సరిపోతుందని భావిస్తున్నారు. మీ పనితీరును మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఐఏఎస్, ఏపీఎస్ అధికారులు నెలలో ఒక్కరోజైనా హాస్టల్‌ను విజిట్ చేయాలి. అక్కడే బస చేయాలి. విద్యార్థుల అవసరాలు తెలుసుకుని, సమస్యలుంటే పరిష్కరించాలి.

 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసు కున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది కలెక్టర్లేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.  సంక్షేమం, అభివృద్దిని ప్రభుత్వం రెండు కళ్లుగా భావిస్తోందని సీఎం తెలిపారు. ఈ నెల 26 నుంచి నాలు గు పథకాలను ప్రభుత్వం ప్రారంభిస్తుందన్నారు.

రైతు భరోసా పథకం కింద  ఎకరా కు ఏడాదికి  రూ. 12 వేలు,  భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి రూ. 12 వేలు, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్‌కార్డులను ప్రభుత్వం అందిస్తుందని, అందుకు సంబందించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేసుకోవాలని సీఎం సూచించారు. 

ఈ నెల 11 నుంచి 15లోగా పథకాల అమలుకు కావాల్సిన పనులు ముగించి, ఈ నెల 24లోపు గ్రామ సభలు పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ల పనితీరే ప్రభుత్వ పనితీరుకు కొలమామని, అందుకు కలెక్టర్లు తమ పనితీరును మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.

శుక్రవారం సచివాలయంలో కలెక్టర్లతో నిర్వహించిన సదస్సు లో సీఎం రేవంత్‌రెడ్డి  మాట్లాడుతూ..  కలెక్టర్లు పథకాల అమలుకు అర్హుల జాబితా ను జిల్లా ఇంచార్జి మంత్రికి అందించాలని, ఇంచార్జి మంత్రి ఆమోదంతోనే కలెక్టర్లు అర్హుల జాబితాను విడుదల చేయాలన్నా రు.  ప్రభుత్వం పేదల కోసమే పని చేస్తుందనే నమ్మకం ప్రజలకు కలగించాలని,  సంక్షేమ ఫలాలు క్షేత్ర స్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

జనవరి 26 తర్వాత అకస్మికంగా తనిఖీలు ఉంటాయని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్య లు తప్పవని సీఎం హెచ్చరించారు. రాష్ట్రం లో వన్ రేషన్.. వన్ స్టేట్ విధానాన్ని తీసుకురాబోతున్నామని, తెలంగాణలో ఒకరికి ఒక రేషన్ కార్డు మాత్రమే ఉండాలన్నారు. ‘కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయాలని ఆదేశాలు ఇచ్చాం.

కానీ కొంత మంది ఆఫీసుల్లో కూర్చుని పనిచేస్తే సరిపోతుందని భావిస్తున్నారు. సమస్యలు వచ్చినప్పుడు సమ ర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ పనితీరును మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఐఏఎస్, ఏపీఎస్ అధి కారులు నెలలో ఒక్కరోజైనా హాస్టల్‌ను విజిట్ చేయాలి.

మహిళా ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులు బాలికల హాస్టల్స్‌కు వెళ్లా లి. అక్కడే బస చేయాలి. విద్యార్థుల అవసరాలు తెలుసుకుని.. సమస్యలుంటే తెలుసు కుని పరిష్కరించాలి’ అని రేవంత్‌రెడ్డి సూ చించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య, ఉపాధి రాజకీయ కులగణన సర్వేను కలెక్టర్లు విజయంతం చేశారని సీఎం అభినందించారు. 

పంట వేసినా.. వేయకున్నా రైతు భరోసా.. 

రైతు భరోసా విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావులేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతు పంట వేసినా.. వేయకున్నా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం హయాంలో వ్యవసాయ యోగ్యంకానీ భూములకు పెట్టుబడి సాయం అందించారన్నారు.

అనర్హులకు రైతు భరోసా ఇవ్వొద్దు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి అనర్హులను గుర్తించాలన్నారు. రియల్ ఎస్టేట్ భూములు, లే అవుట్ భూములు, నాలా కన్వర్ట్ అయిన భూములు, మైనింగ్ భూములు, ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల కింద సేకరించిన భూముల వివరాలను ముందుగా సేకరించాలన్నారు.

గ్రామ పంచాయతీ, మున్సిపా లిటీల రెవె న్యూ రికార్డులను, విభాగాల రికార్డులన్నీ క్రోడీకరించుకోవాలని, వీటితో పాటు విలేజ్ మ్యాప్‌లను పరిశీలించి అధికారులు ఫీల్డ్‌కు వెళ్లి ధృవీకరించు కోవాలన్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాను పక్కా గా తయారు చేసి గ్రామ సభల్లో  చర్చించి ప్రచురించాలన్నారు.   

భూమిలేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు మాత్రమే ఇం దిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలన్నారు. రైతు భరోసాను రూ. 12 వేలకు పెంచిన అంశాన్ని సీఎం గుర్తు చేశారు. భూమిలేని నిరుపేదలు ఏడాదిలో 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసి ఉండాలని, వారికే ఇందిర్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపచేయాలన్నారు.

గూడు లేని పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇప్పటికే ఇందిరమ్మ యాప్ ద్వారా గుర్తించిన 18.32 లక్షల మంది వివరాలను జిల్లాలకు పంపించామని, అందులో అత్యంత నిరుపేదలను గుర్తించి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

లబ్ధిదారుల ఎంపిక ఫ్లెక్సీల ద్వారా ప్రకటించాలి

 పథకాల అమలుకు భారీ వ్యయ మే అయినప్పటికీ.. రాష్ట్రంలో పేదలకు మేలు చేయాలన్న భావనతో విస్తృతంగా చర్చించి.. పథకాల అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకు న్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జనవరి 26 నుంచి నాలుగు ప్రధానమైన పథకాలను అమలవుతాయన్నారు.

పథకాల అమలులో ఇందిరమ్మ కమిటీల భాగస్వామ్యం తీసుకోవాలని డిప్యూటీ సీఎం కలెక్టర్లకు వివరించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధ్దిదారుల వివరాలను ప్రతీ గ్రామంలో ఫ్లెక్సీల ద్వారా ప్రకటించాలన్నారు.

రైతు రుణమాఫీకి ప్రభు త్వం రూ. 22 వేల కోట్లు విడుదల చేసిందని, ఆ వివరాలను కూడా ప్రతీ గ్రామంలో ప్రకటించాలని భట్టి సూ చించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక ఉండాలన్నారు. 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  

ఇంచార్జి మంత్రి ఆమోదంతోనే.. 

రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఒక ఏడాదిలోనే ఎన్నో ప్రజోపయోగ పనులను అమలు చేస్తోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ నెల 26 నుంచి అమలు చేసే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు సమర్థవంతంగా అమలు చేసే గురుతరబాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు.

ప్రతి నియోజక వర్గానికి మొదటి దశలో 3,500 ఇళ్లు కేటాయించినట్లు,  ఇళ్లకు అత్యంత నిరుపేదలను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలన్నారు. జిల్లా ఇంచార్జి మంత్రి ఆమోదంతోనే జాబితా ప్రకటించాలని మంత్రి సూచించారు. ఒక కుటుంబానికి ఒకే ఇల్లు మంజూరు చేయాలన్నారు.

గతంలో నిర్మించిన డబుల్‌బెడ్ రూమ్‌లు అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని, వాటిని లబ్ధిదారుల భాగస్వామ్యంతోనే పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వర్‌రావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, సీఎస్ శాంతికుమారి, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర అదికారులు పాల్గొన్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి